ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తూంటే.. ఫ్యాక్ట్ చెక్‌ల రోజంతా పడిగాపులు పడాల్సి వస్తోంది. విపక్ష నాయకులు ఎప్పుడు విమర్శలు చేస్తే వెంటనే వివరణలు ఇవ్వడానికి ముగ్గురు, నలుగుర్ని లైన్లో పెట్టాల్సి వచ్చింది. ఇదంతా మారిపోయిన రాజకీయం. కానీ ఏడాది కిందటి వరకూ సీన్ వేరేగా ఉండేది.
గతంలో టీడీపీ వివరణలు ఇచ్చుకునేది !
మూడున్నరేళ్ల పాటు టీడీపీ పై ఆరోపణలు.. విచారణలు.. కేసులతో వైసీపీ హోరెత్తించింది. ఇప్పుడు అవి లేవని కాదు.. ఉన్నాయి. కానీ సీన్ మారిపోయింది. ఎన్ని ఉన్నా వైసీపీ వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాము తప్పు చేయలేదని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఏడాది కిందట వరకూ.. వైసీపీ కేసులు, దాడుల రాజకీయాలు అనేక మంది టీడీపీ సీనియర్లు బయటకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు క్రమంగా పరిస్థితి రివర్స్ అయింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అని.. మరొకటని ఆరోపణలు జోరుగా చేశారు. అరెస్టులు చేయించారు. వీటన్నింటిపై వివరణ ఇచ్చుకోవడానికి టీడీపీ తంటాలు పడేది. ఇక మూడు రాజధానుల విషయంలోనూ ఫిక్స్ చేసినంత పని చేశారు. గట్టిగా విశాఖ రాజదానికి వ్యతిరేకమని చెప్పలేని పరిస్థితిని కల్పించి.. మూడు రాజధానులపై వీలైనంత తక్కువ వాయిస్ ఉండేలా చేయగలిగారు. వైసీపీ అఫెన్సివ్ రాజకీయాలతో టీడీపీ డిఫెన్స్ ఆడుతూ వచ్చింది. వివరణలు ఇచ్చుకుంటూ.. ధర్నాలు చేసుకుంటూ రాజకీయాలు చేసింది.
అన్ని ప్రాంతాల్లోనూ అమరావతే రాజధాని టీడీపీ ప్రచారం
చంద్రబాబునాయుడు రాయలసీమ నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కర్నూలు వెళ్లి అమరావతే మన రాజధాని అని ప్రకటించి వచ్చారు. తర్వాత విశాఖలోనూ అదే చెప్పారు. దీంతో ఇక టీడీపీ వాయిస్ పూర్తిగా మారిపోయింది. అదే సమయంలో వైసీపీ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడంతో ప్రజల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆరోపణలు చేయడం.. వైసీపీ వివరణ ఇచ్చుకోవడం కామన్ గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితి వైసీపీకి మింగుడు పడటం లేదు.
విపక్ష నేతల ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక తిట్ల దండకాలు
ఇప్పుడు ఏపీలో ఓ వైపు చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్ర నడుస్తోంది. మరో వైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. ముగ్గురూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో .. రోజుకు నలుగురు, ఐదుగురుమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయాల్సి వస్తోంది. అసలు ఆరోపణలకు సమాధానం చెప్పలేక తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు. ఎజెండా విపక్షాలు సెట్ చేస్తే వైసీపీ వివరణ ఇచ్చుకున్నట్లుగా పరిస్థితి మారిపోయింది.