సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే సానుకూల ఫలితం రాలేదు. తర్వాత విశాఖ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీలో చేరలేదు. జనసేన పార్టీకి రాజీనామా చేసినందున.. మళ్లీ జనసేన పార్టీ నేతలు ఆయనను ఆహ్వానించడం లేదు.. జేడీనే తాను చేరుతానని వెళ్లలేకపోతున్నారు. రెండు వైపుల నుంచి ఈగో సమస్యల్లా… వారు పిలువలేదు.. తాను వెళ్లలేదన్నట్లుగా ఉండటంతో జేడీకి రాజకీయ వేదిక లేకుండా పోయింది.
జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని చదువుకున్న వారు కోరుకుంటారు. కానీ రాజకీయాలు రౌడీలు, దొంగలు , దోపిడీదారులకే ప్రత్యేకం అన్నట్లుగా మారిపోయాయి. అలాంటి ఇమేజ్ ఉన్న వారికే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. బాగా చదువుకున్నారు… సాఫ్ట్ గా ఉన్నారు … . అంటే రాజకీయాలకు పనికి రారేమో అనుకుంటున్నారు. జేడీ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఆయన లాంటి వారు రాజకీయాలకు అవసరం. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ పార్టీని వేదికగా చేసుకోవడం మంచిది.
ఆయన పార్టీలో చేరుతానంటే వద్దనే వారు ఎవరూ ఉండరు. వైసీపీలో చేరడం ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చునని అంటున్నారు. టీడీపీలో విశాఖ టిక్కెట్ భరత్ కు కేటాయించారు. బీజేపీలో చేరేందుకు ఎందుకో మొదటి నుంచి ఆసక్తి చూపించడం లేదు. మొత్తంగా జేడీ.. తనకు ఓ పొలిటికల్ ఫ్లాట్ ఫార్మ్ ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అంటే… ఓ మంచి నేత రాజకీయాలకు దూరం కావడమే అవుతుందని … ఎక్కువ మంది బాధపడుతున్నారు.