ఏపీ బీజేపీని నడిపించమని పగ్గాలిస్తే పార్టీ డబ్బుల్ని కూడా ఇష్టారీతిన కొట్టేసిన వైనం ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. గతంలో ఎన్నికల నిధుల్ని దుర్వినియోగం చేశారని కన్నా లక్ష్మినారాయణపై వైసీపీ నేతలు ఆరోపించేవారు. బీజేపీ అంతర్గత విషయాల్లో వైసీపీ జోక్యం ఏమిటన్నది చాలా మందికి అర్థం కాలేదు కానీ.. ఆ నిధుల్ని విజయసాయిరెడ్డే సర్దారని.. ఆయనకు లెక్కలు చెప్పలేదనే ఆ ఆరోపణలు చేశారని అనుకున్నారు.
ఇప్పుడు సోము వీర్రాజు చీఫ్ గా ఉన్నప్పుడూ ఇలాంటివి చాలా జరిగాయని పార్టీ నిధులు గోల్ మాల్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అతంర్గతంగా బీజేపీ నేతలు ఆడిట్ నిర్వహిస్తున్నారు. కొత్త అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టిన తర్వాత లెక్కలు తీయడంతో… అప్పనంగా డబ్బులు కాజేసిన వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. కొంత మంది డబ్బులు తిరిగిచ్చారని .. కొంత మంది చేతులెత్తేసి పార్టీతో సంబంధం లేనట్లుగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది.
సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే… పెద్ద ఎత్తున విరాళాల్ని సమీకరించి… పార్టీకి ఆదాయం తెచ్చి.. తాను పార్టీ కోసం ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం మొత్తం రివర్స్. పార్టీ డబ్బుల్నే మింగేశారు. ఏపీ బీజేపీలో ఉన్న కొంత మంది వ్యవహారశైలి కారణంగా.. హైకమండ్ పెద్దలు ఆ పార్టీ కార్యకలాపాల్ని కూడా నమ్మలేని పరిస్థితికి వెళ్లిపోతోంది.