ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగించడం ద్వారా విజయం సాధించాలని.. ప్రజాస్వామ్యాన్ని వైఎస్ వివేకాను నరికినట్లుగా అడ్డంగా నరికేయాలని భారీ కుట్ర జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం ఎంత సీరియస్ గా తీసుకున్నా వైసీపీ ఓ వార్ రూమ్ తరహాలో ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకుని మరీ… ఓట్ల తొలగింపు ఉద్యమం చేపట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
సజ్జల నేతృత్వంలో బృందం
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్ల తొలగింపు మిషన్ కు నాయకత్వం వహిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్ల కిందట అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశం పెట్టి ఎన్ని ఓట్లు తీసేయాలో దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ప్రతి మండలం వారీగా… ఓట్ల తొలగింపుపై ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నేతలకు ఆయన టీమ్ నుంచి సందేశాలు వెళ్తున్నాయి. ఇదంతా ప్రణాళికాబద్దంగా జరుగుతోంది. కింది స్థాయి అధికారులపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఫామ్ 7ల పేరుతో అసలు స్కెచ్
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ 7ల పేరుతో ఇతరుల ఓట్లు తొలగించాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు చేశారు. అవన్నీ ఫేక్ అని.. ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు చేశారని తేలింది. దీనిపై సిట్ ను వేశారు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఫామ్ 7 స్కెచ్ నడుస్తోంది. వైసీపీ నేతలు ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఫామ్ 7లు దాఖలు చేస్తున్నారు. కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఓట్లు తొలగించి… గెలవాలనుకుంటున్నారు.
దొంగ ఓట్లని ఎదురుదాడి !
టీడీపీ హయాంలో వేల కొద్దీ దొంగ ఓట్లు నమోదయ్యాయని వాటిని తొలగిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అన్ని వేల ఓట్లు దొంగఓట్లు అయితే వైసీపీ అంత భారీ విజయం ఎలా సాధిస్తుంది ?. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ ఓట్లను తీసేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రతి తొలగించిన ఓటుపై రీ వెరిఫికేషన్ చేయాలని ఈసీ నిర్ణయించింది. అయితే దిగువస్థాయి అధికారులపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. అందుకే… కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారానే ఈ పని చేయించాల్సి ఉంది.