‘ల కేత్వ మియ్యనేరడు.. ద కును కొమ్మియ్యడిట్టి దాతలు గలరే…’ అంటూ వెనకటికి ఎవరో మహా కవి గారు.. ఎవరో మహా దాత గురించి తనదైన శైలిలో చాటువులు అనే పద్యాల్లో వర్ణించినట్లుగా పెద్దలు చెబుతుంటారు. ఇదంతా రాజరికం రాజ్యమేలుతున్న రోజుల్లో వారి ప్రాపకం సంపాదించి కవులు, కళాకారులు తమ జీవితాలను వెళ్లదీసిన రోజుల నాటి సంగతి. అయితే ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొరగారి పాలన కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎవరైనా సరే.. ఆయన వరకూ వెళ్లగలగడమే కష్టం.. వెళ్లిన తర్వాత.. ‘అయ్యా నాకు ఫలానా సాయం కావాలి’ అని విన్నవించుకుంటే చాలు ఆయన అనుగ్రహించేస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. నందమూరి బాలకృష్ణ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఉన్న కొన్ని సమస్యల గురించి నివేదించారు. అంతే.. కేసీఆర్ ఆ ఆస్పత్రి నిర్మాణాల్లో బీపీఎస్ కింద విధించవలసి ఉన్న 5.73 కోట్ల రూపాయలను మినహాయించేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఆ రకంగా కోరిన వరం ప్రసాదించేశారు.
బసవతారకం ట్రస్టు ఆధ్వర్యంలో బాలకృష్ణ నేతృత్వంలో నడనుస్తున్న కేన్సర్ ఆస్పత్రిలో ఇటీవలి కాలంలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు, కొత్తబ్లాకులు చేసేశారు. వాటిని రెగ్యులరైజ్ చేయడం గురించి కొన్ని నెలల కిందట బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఏమాత్రం వెనకాడలేదు. తాజాగా 5.73 కోట్ల మినహాయింపు ఇచ్చేస్తూ గురువారం నాడు జీవో ఇచ్చేశారు.
వ్యవస్థకు అనుగ్రహించడం అనేది చాలా మంచి పద్ధతి. వ్యవస్థలో ఒక లోపం ఉంటే.. దాన్ని చక్కదిద్దేలా.. ఒక మార్గాంతరం చూసుకోవడం కిందికి ఆ పద్ధతి వస్తుంది. వ్యవస్థను చక్కదిద్దేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. కానీ కేసీఆర్ గారి అనుగ్రహ ప్రాప్తి చాలా సందర్భాల్లో వ్యవస్థకు కాకుండా వ్యక్తులకు మాత్రమే జరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం. పావలా శ్యామల వెళ్లి ‘దేహీ’ అనగానే కేసీఆర్ బతికినంత కాలమూ సర్కారు వారి పెన్షన్ ఇచ్చేస్తారు…! కేసీఆర్ వరకూ వెళ్లగలిగే మార్గాలు తెలియని ఇతర పేద వృద్ధ కళాకారుల పరిస్థితి ఏమిటి? వారు ఆకలి చావులు చావాల్సిందే! అందుకే ఏలిన వారు అనుగ్రహించే ముందు.. తాము ప్రకటించే వరాలు వ్యవస్థకు మేలు చేస్తాయా? వ్యక్తులకు మేలు చేస్తాయా ఒకసారి చెక్చేసుకుంటూ ఉంటే మంచిది.