కేసీఆర్ రాజకీయానికి తుమ్మల రాజకీయ జీవితం డైలమాలో పడిపోయింది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఆయనను మునగచెట్టుపై కూర్చోబెట్టారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయేసరి షెడ్డుకు పంపేశారు. ఇప్పుడు టిక్కెట్ కూడా లేకుండా చేశారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన నేతను చేర్చుకుని టిక్కెట్ ఖరారు చేశారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తర్వాత వచ్చిన పాలేరు ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మలకు టిక్కెట్ విషయంలో మొండి చేయి చూపారు. ఇటీవలి కాలంలో పాలేరులో పర్యటించినప్పుడల్లా పోటీ చేసి తీరుతానని తుమ్మల నాగేశ్వరరావు చెబుతూ వస్తున్నారు. కానీ టిక్కెట్ ప్రకటించలేదు.
మరో వైపు ఖమ్మంలో నాయకుల కొరత ఎదుర్కొంటున్న బీజేపీ తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీలోకి ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉన్న నేత వస్తే బీజేపీ లాభపడుతుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా తుమ్మలను కూడా చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు పాలేరు సీటు కేటాయించేందుకు సిద్దమని సంకేతాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే అనుచరవర్గం అంతా చెల్లా చెదురు అవుతుందని… వేరే పార్టీలో చేరిపోవాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు.
పార్టీ మారొద్దని కేసీఆర్ రాయాబారాలు పంపుతున్నారు. తుమ్మల ఏం చేస్తారన్నది ఖమ్మం రాజకీయాలను మలుపు తిప్పే అంశం అవుతుంది.