ఏపీలో కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియడంలేదు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రాయలసీమలో రైతులు పురుగు మందు డబ్బాలతో రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితులపై మీడియా వార్తలు రాయడంతో.. ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ వివరణ ఏమిటంటే… కరోనా , ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ఏపీలో కరెంట్ కోతలు తప్పడం లేదట. కరోనా ప్రభావం ఆగిపోయి రెండేళ్లు అయింది.. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావానికి ప్రపంచం సర్దుకుపోయింది. మరి ఏపీ సర్కార్ కు వచ్చిన ఇబ్బందేమిటంటే…. కరోనా, ఉక్రెయిన్ యుద్ధాల వల్ల బొగ్గు దొరకడం లేదట.
రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గును కొని నిల్వ చేసుకోలేదు. కనీసం రెండు వారాలకు సరిపడా బొగ్గును నిల్వ ఉంచుకోవడం విద్యుత్ సంస్థలు చేయాల్సిన పని లేదు. కానీ ఒక్క రోజు… బొగ్గును మోసుకొచ్చే గూడ్స్ రైలు రాకపోతే… ఇక కోతలే. అదే సమయంలో విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్ సంస్థల పేరుతో వేలకోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించిన ప్రభుత్వం వీటి సామర్థ్యాన్ని పెంచడానికి పెద్దగా ఖర్చుపెట్టలేదు. బహిరంగ మార్కెట్లో కొనడంలేదు. ప్రజల్ని వారి ఖర్మకు వారిని వదిలేసింది.
ఈ సారి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షా కాలం అన్నపేరే కానీ వారం, పది రోజులు తప్ప ఎక్కడా వర్షాలు పడటం లేదు. అంతే కాదు ఎండలు , ఉక్కపోత పెరుగుతున్నాయి. తాము చల్లగా కరెంట్ కోతల్లేని ఏసీ గదుల్లో సేద తీరుతున్న వైసీపీ నేతలు… గ్రామాల్లో ప్రజల కష్టాలను చూసి.. పాపం అనుకుంటున్నారు. తమ చేతకాని తనాన్ని …. కరెంట్ కొనలేకపోతున్నాం అన్న మాటల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కరెంట్ సరిపోవడం లేదో కథలు చెబుతున్నారు….కానీ ప్రజలకు కావల్సింది కారణాలు..కరెంట్ అనే సంగతిని గుర్తించడం లేదు.