సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించిన తెలంగాణ హైకోర్టు తీర్పు సరి కాదని, ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందంటూ సుప్రీంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు నుంచి ఆమెను వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఓబులాపురం ఐరన్‌ఓర్ కంపెనీకి సంబంధించి గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను మళ్ళీ విచారించాల్సిందేనని స్పష్టంగా తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
గత ఏడాది నవంబర్‌లో ఓఎంసీ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ప్రకటించింది. కేసు నమోదైన తర్వాత కేసు విచారణల్లో మెరిట్స్‌లో ఎప్పుడూ ఆమెకు ఊరట దక్కలేదు. క్వాష్ పిటిషన్లు సహా ఏ విషయంలోనూ ఆమెకు ఊరట దక్కలేదు. చివరికి.. గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో రోజువారీ విచారణ ప్రారంభమైన దశలో ఆమెకు క్లీన్ చిట్ లభించింది. ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఆమె ఏడాదిన్నర వరకూ జైలు శిక్ష అనుభవించింది. విచారణ సమయంలో ఉద్దేశపూర్వకంగా సీబీఐ అధికారులు శ్రీలక్ష్మి కేసులపై అడిగిన వివరాలు ఇవ్వకపోవడం వల్ల సాంకేతిక అంశాలతో ఊరట లభించడంతో సీబీఐ తీరుపై విమర్శలు వచ్చాయి.
అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. విచారించాల్సిందేనని చెబుతోంది. సుప్రీంకోర్టుకు అయినా స్పష్టమైన సాక్ష్యాలు సమర్పిస్తుందో లేదోనన్న సందేహాలు ఈ కేసులను పరిశీలిస్తున్న వారు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినప్పటికీ సుప్రీం కోర్టులో ఆమె భవిష్యత్ తేలనుంది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత మాత్రమే ఆమెకు ప్రయారిటీ లభించింది. తెలంగాణ క్యాడర్ నుంచి ఎలాగోలా ఏపీ క్యాడర్‌కు తెప్పించి… చకచకా పోస్టింగ్‌లు ఇచ్చారు. త్వరలో సీఎస్ అవుతారన్న ప్రచారమూ జరుగుతోంది.