డబ్బై ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఒక్క తెలుగు నటుడికి కూడా జాతీయ అవార్డ్ రాలేదు. ఎందుకు ? ఇక్కడ ప్రతిభావంతులైన నటులు లేరా? జాతీయ అవార్డు ఇచ్చేటంత నటన కనబరచాలేదా? ఇక్కడ సమస్య ప్రతిభది కాదు.. నిర్మోహమాటంగా చెప్పాలంటే లెక్కలనితనం. తెలుగు సినిమా అంటే లెక్కలేనితనం. అసలు ఇక్కడో పరిశ్రమ వుంది, సినిమాలు తీసుస్తున్నారనే స్పృహ కూడా లేకుండా చాలాకాలం వ్యవహరించారు నేషనల్ అవార్డ్ జ్యూరీలో కూర్చున్న కొందరు పెద్దలు.
కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. 69వ జాతీయ అవార్డ్స్ జాబితా గమనిస్తే తెలుగు సినిమా డామినేషన్ కనిపించింది. అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ వార్త చదువుతున్న చాలా మందికి ‘ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా చెప్పుకుంటూపొతే బోలెడుమంది వెటరన్స్ వున్నారు కదా వీళ్ళలో ఇప్పటివరకూ ఒక్కరికి నేషనల్ అవార్డ్ రాలేదా?` అని అనుమానం కలుగుతుంది. నిజమే.. ఇప్పటివరకూ ఇలాంటి ఈ అవార్డ్ కు ఒక్క తెలుగు నటుడు కూడా అర్హుడుగా కనిపించలేదా అనే ఆశ్చర్యం కలగకమానదు.
ఐతే ఇప్పుడా గతాన్ని మార్చేస్తూ తెలుగు సినిమా ఎదిగింది. ఈసారి నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా డామినేషన్ స్పష్టంగా కనిపించింది. దీనికి కారణం రాజమౌళి అనే చెప్పాలి. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆరు నేషనల్ అవార్డ్స్ ని కొల్లగొట్టింది. పుష్ప సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఉప్పెన సినిమాకి అవార్డ్ దక్కింది. అలాగే కొండపొలంలో పాటకు చంద్రబోస్ జాతీయ పురస్కారం అందుకున్నారు.
నేషనల్ అవార్డు తెలుగు సినిమాకి నిన్నా మొన్నటి వరకూ అందని ద్రాక్ష. ఒక్క అవార్డు వచ్చినా.. అదో మహా ప్రసాదం. ప్రతీసారి మనకెందుకు అవార్డులు రావు? అనే బాధ. ఒక్క అవార్డు కూడా రాదా? అని ఎదురుచూస్తున్న పరిస్థితి నుంచి డామినేషన్ చేసే స్థితికి తెలుగు సినిమా రావడం అనందం. ఈ ఆనందానికి కారణం రాజమౌళి విజన్. ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రభుత్వం ఆస్కార్ కి నామినేట్ చేయలేదు. కానీ రాజమౌళి ఒక సవాల్ గా తీసుకున్నాడు. ఆస్కార్ రావాలంటే ఏం చేయాలో అన్నీ పగడ్బందీగా చేశాడు. రాజమౌళి ఎందుకు అంత తాపత్రపడుతున్నారో చాలా మందికి అర్ధం కాలేదు. ఓ పాటకి ఆస్కార్ రాగానే ఏం జరిగిపోతుందని కామెంట్లు చేశారు. కానీ రాజమౌళి పెట్టిన శ్రమకి ఫలితం ఈ రోజు వచ్చింది.
ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడానికి ఆస్కార్ అవార్డ్ ఒక కొలబద్దగా నిలిచింది. నేషనల్ అవార్డ్ జ్యూరీ సభ్యులని ఆర్ఆర్ఆర్ ని అన్ని కేటగిరీలు ఆకర్షించాయంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి తెచ్చిన ఆస్కార్ ప్రభ. రాజమౌళి తన విజన్ తో తెలుగు సినిమాకి కొత్త దారులు తెరిచారు. ఆయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా గేట్లు తెరవకపోయుంటే ఈ రోజు పుష్పకి ఈ గౌరవం దక్కేదా అనేది ప్రశ్నార్ధకం. ఇప్పుడు తెలుగు సినిమా డామినేష్ లో రాజమౌళి ది కీలక పాత్ర. ఇప్పుడే ఇదే స్ఫూర్తితో తెలుగు సినిమా ముందుకు కదలాలి.