జేఎన్‌యూలో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కేసులో కీలకనిందితుడుగా అరెస్టు అయిన విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ బెయిలు మీద విడుదల అయ్యారు. విద్యార్థి గ్రూపులు ఆయనను హర్షాతిరేకాల మధ్య జెయిలునుంచి తిరిగి తమ యూనివర్సిటీకి తీసుకువెళ్లాయి. అంతా బాగానే ఉంది. అయితే మోడీ వ్యతిరేక దేశవ్యాప్త ప్రచారానికి పూనుకోబోవడంలో కన్హయ్యకుమార్ లేదా, ఆయా వర్గాల భవిష్య కార్యాచరణ ఏమిటి?
అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చోపచర్చలను బట్టి.. కన్హయ్య కుమార్‌ను కాంగ్రెసు పార్టీకి చెందిన రాహుల్‌గాంధీ కూడా పరామర్శించబోతున్నట్లు అనుకుంటున్నారు. ఒకటిరెండు రోజుల్లో కన్హయ్యను రాహుల్‌గాంధీ కలిసే అవకాశం కూడా ఉన్నదని సమాచారం. వీరి మధ్య భేటీ జరిగితే.. రాహుల్.. తాము పూర్తి మద్దతు ఇస్తాం అని.. జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్త ఉద్యమం లేవదీయడానికి ముందుకు రావాలని కన్హయ్యను కోరే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కన్హయ్యకు అన్యాయం జరిగిందంటూ.. ఆయననే ముందుకు నెట్టి.. ప్రొజెక్టు చేయడం ద్వారా, కన్హయ్యనే దేశమంతా తిప్పడం ద్వారా.. దేశవ్యాప్తంగా కన్హయ్య విద్యార్థులను కూడగట్టడానికి కాంగ్రెసు పార్టీ వెన్నంటి నిలుస్తుందనే సంకేతాలు ఇవ్వడానికి రాహుల్ ఉత్సాహపడుతున్నారని సమాచారం. ఇదంతా కన్హయ్యను దేశవ్యాప్త హీరోగా చేయడానికి ప్రయత్నంలా కనిపిస్తున్నా… ప్రధానంగా మోడీని విద్యార్థి వర్గాల్లో విలన్‌గా చిత్రీకరించడమే అసలు లక్ష్యమనే అభిప్రాయం కూడా వినినిస్తోంది.
అయితే మౌలికంగా వామపక్ష భావజాలానికి చెందిన కన్హయ్యకుమార్, రాహుల్ ప్రలోభాలకు లొంగుతారా? రాహుల్ ఆశించే వక్రప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడా లేదా అనేది వేచిచూడాలి.