నిన్న ప్రకటించబడిన జాతీయ అవార్డులలో అల్లు అర్జున్ పుష్ప సినిమా కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించి ,ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తెలుగు ప్రేక్షకులందరిలోనూ ఈ సంఘటన ఆనందాన్ని నింపింది. అయితే రామ్ చరణ్ విషయంలో అవార్డుల సమయంలో బ్యాడ్ వెంటాడుతోంది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్ నటించిన మగధీర సమయంలో, రెండవ సినిమాకే ఇంత ప్రతిభ కనబరచాడా అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఆ సినిమా లో రామ్ చరణ్ నటన కి గాను నంది అవార్డు వస్తుందని అంతా భావించారు. ఉత్తమ నటుడి గా నంది అవార్డు కై రామ్ చరణ్ పోటీ పడ్డాడు కూడా. అయితే అనూహ్యం గా ఆ సంవత్సరానికి గాను ఉత్తమ నటుడి గా అవార్డు సాధించారు దాసరి నారాయణరావు. మేస్త్రి సినిమాలో ఆయన చూపిన నటనకు ఈ అవార్డు ఆయనను వరించింది. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నడుపుతూ ఉండగా, దాసరి నారాయణరావు అధికార కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు అసలు మేస్త్రి అన్న ఆ సినిమా కేవలం చిరంజీవి ని రాజకీయం గా టార్గెట్ చేయడం కోసమే తీసింది అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇదే రాజకీయ కారణాలతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరీని ప్రభావితం చేసి దాసరి నారాయణరావు కు ఉత్తమ నటుడు గా అవార్డు వచ్చేలా చేసింది అన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఆ రకంగా అప్పట్లో రామ్ చరణ్ ని బ్యాడ్ లక్ వెంటాడింది.
ఆ తర్వాత 2018 లో రంగస్థలం సినిమా లో తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు రామ్ చరణ్ . చిట్టి బాబుగా చెవిటి పాత్ర లో ఆయన చూపిన నటన తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా కి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కై పోటీపడ్డారు రామ్ చరణ్. అదే సంవత్సరం కీర్తి సురేష్ కూడా మరొక తెలుగు సినిమా అయినటువంటి మహానటి కోసం ఉత్తమ నటి గా పోటీ పడ్డారు. ఉత్తమ నటి అవార్డు విషయంలో జూరీ ఎటువంటి అభిప్రాయ బేధాలు లేకుండా కీర్తి సురేష్ వైపు మొగ్గు చూపగా ఉత్తమ నటుడి అవార్డు విషయంలో గుడ్డి వాడి పాత్రలో నటించిన ఆయుష్మాన్ ఖురానా, చెవిటి వాడి పాత్రలో నటించిన రామ్ చరణ్ ల మధ్య పోటీ నెలకొంది. అయితే హిందీయేతర భాషలకు చెందిన ఆర్టిస్టులకు ఒకే సంవత్సరం ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి అవార్డు ఇచ్చిన సందర్భాలు జాతీయ అవార్డుల విషయంలో అత్యంత అరుదు. ఆ రకంగా ఉత్తమ నటుడి అవార్డు విషయంలో చివరకు జూరీ ఆయుష్మాన్ ఖురానా వైపు మొగ్గు చూపింది. కనీసం ఆయుష్మాన్ ఖురానా తో పాటుగా రామ్ చరణ్ కి కూడా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పంచుకునే అవకాశం రావచ్చు అని ఎదురు చూసిన ఆయన అభిమానులకు ఆ రకంగా మళ్ళీ నిరాశ ఎదురయింది.
ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ విషయంలో మరొకసారి రామ్ చరణ్ ని దురదృష్టం వెంటపడింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు జాతీయ మీడియా సంస్థలు అవార్డుల ప్రకటనకు కొద్ది రోజుల ముందే, రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లలో ఒకరు ఈసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందే అవకాశం ఉందంటూ కథనాలు వెలువరిచాయి. అయితే మల్టీ స్టార్ గా రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నటనకు గాను రామ్ చరణ్ కు అవార్డు ఇచ్చే విషయం లో జూరీ సభ్యుల మధ్య ,కొన్ని ఇతర కారణాల వల్ల, భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అనేక చర్చల తర్వాత రామ్ చరణ్ కు కాకుండా పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడానికి జూరీ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
అవార్డు కోసం పోటీపడే వ్యక్తులు సమఉజ్జీలుగా ఉన్నప్పుడు, చివరకు ఎవరికీ అవార్డు ఇవ్వాలనే విషయంలో జూరీ సభ్యులు తర్జనభర్జన పడుతున్నప్పుడు అనేక సూక్ష్మమైన అంశాలు కూడా చర్చల్లోకి వస్తాయి. అటువంటి సమయం లో ఎంపిక కి కారణాలు ఊహతీతంగా ఉంటాయి. బహుశా అందుకే పైకి కనిపించని ఈ కారణాల వల్ల ఫలితాన్ని అదృష్టం లేదా దురదృష్టం నిర్ణయించింది అన్న అభిప్రాయాలు సామాన్యుల వద్ద నుండి వినిపిస్తూ ఉంటాయి. బహుశా రామ్ చరణ్ విషయంలో ప్రస్తుతం జరుగుతోంది ఇదే.
ఏది ఏమైనా చివరి మెట్టు వరకు వచ్చి దురదృష్టవశాత్తు అవార్డులను పొందుకోలేకపోతున్న రామ్ చరణ్- పట్టిష్టమైన లైనప్ కలిగిన సినిమాలు చేస్తున్న కారణంగా భవిష్యత్తులో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించే అవకాశం ఉందంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి అది ఎప్పుడు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి.