సచివాలయం ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. ఇప్పుడు సచివాలయంలో ఆలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించడమే కాదు గేటు దగ్గరకు వెళ్లి కేసీఆర్ స్వయంగా ఆహ్వానం పలికారు. తర్వాత సెక్రటేరియట్ ను స్వయంగా చూపించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సీఎస్ శాంతికుమారితో అతిథి మర్యాదలు కూడా చేశారు. ఇలా జరగడానికి గత రెండు, మూడు రోజుల్లో మారిపోయిన రాజకీయాలేమీ లేవు. మరి ఎందుకు కేసీఆర్ హఠాత్తుగా మారిపోయారు ?
కేసీఆర్ రాజకీయాలు ఊహించనివిగా ఉంటాయి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన ఫైల్ గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ లో ఉంది. అలాగే ఆర్టీసీ విలీనం పైల్ న్యాయసమీక్షలో ఉంది. ఇవి ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ఎమ్మెల్సీల ఫైల్ పక్కన పెడితే మళ్లీ తర్వాత వచ్చే ప్రభుత్వమే వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చే బిల్లు కూడా ప్రభుత్వానికి ముఖ్యమే. గవర్నర్ తో లొల్లి ఇలాగే కంటిన్యూ అయితే సమస్యలు వస్తాయని కేసఆర్.. రాజీకి వచ్చినట్లుగా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.
అయితే ఇప్పుడు గవర్నర్ తో మామూలుగా ఉండటం వల్ల.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందన్న ప్రచారం చేసే వారికి ఈ పరిణామం మరింత బలం చేకూరుస్తుంది. ఇది బీజేపీకి మరింత ఇబ్బందికరం కానుంది. అయినా కేసీఆర్ రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఆయన వ్యూహం గురించి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రత్యర్థుల్ని నెట్టడం ఆయన మార్క్ అనుకోవచ్చు.