టాలీవుడ్ లో మెగా హీరోలదే డామినేషన్. ఎందుకంటే ఆ ఇంట్లో ఏడెనిమిదిమంది హీరోలు ఉన్నారు. ప్రతీ సీజన్లోనూ ఏదో ఓ మెగా మూవీ వస్తూనే ఉంటుంది. చిరు,పవన్, చరణ్, బన్నీ.. ఇలా అందరూ స్టార్లే. కాబట్టి… కొడితే బాక్సాఫీసు బద్దలే. కానీ ఈ సీజన్లో మెగా హీరోలకు అంతగా కలసి రాలేదు. పవన్ కల్యాణ్ `బ్రో`తో మొదలెడితే.. కాస్త పాజిటీవ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా ఆ టాక్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇమిటేషన్లు ఎక్కువై, అసలు కథ మూలకెళ్లింది. బిలో యావరేజ్ స్థాయి దగ్గరే ఆగిపోయిన బ్రో… నిర్మాతలకు నష్టాల్ని మిగిల్చింది.
భోళా శంకర్ పరిస్థితి మరీ దారుణం. చిరంజీవి – మెహర్ రమేష్ కాంబోలో రూపొందించిన సినిమా ఇది. మెహర్ ఎప్పటిలానే ట్రోలింగ్ మెటీరియల్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. హిట్టూ, ఫ్లాపూ పక్కన పెడితే, చిరంజీవిపై ఈసారి విమర్శలు ఎక్కువ అయ్యాయి. చిరు తన వయసుకి తగిన పాత్రలు ఎంచుకోవాలని, కుర్రాళ్లలా కనిపించడం తగ్గించుకోవాలని హితవులు పలికారంతా. చిరు తను చేయబోతున్న సినిమాల విషయంలో పునరాలోచించుకొనే పరిస్థితి వచ్చింది. అంతే కాదు.. చిరు తన పారితోషికంలో కొంత భాగాన్ని నిర్మాతకు వెనక్కి ఇచ్చి ఆదుకొన్నాడు.
ఇప్పుడు గాండీవధారి అర్జున వంతు. వరుణ్‌తేజ్ – ప్రవీణ్ సత్తారు కాంబోలో రూపొందించిన చిత్రమిది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దాదాపు రూ.50 కోట్లతో వరుణ్ కెరీర్లోనే భారీ బడ్జెతో రూపొందించిన సినిమా ఇది. నాన్ థియేటరికల్ రైట్స్ మినహాయిస్తే… థియేటర్ నుంచి కనీసం రూ.5 కోట్ల ఆదాయం కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆ లెక్కన వరుణ్ ఖాతాలో ఓ భారీ డిజాస్టర్ పడినట్టే.
ఈ ఫ్లాపుల మధ్య మెగా హీరో అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం ఒక్కటే కాస్త ఉపశమనం కలిగించే విషయం.