ఈవారం బాక్సాఫీసు ముందుకు మూడు సినిమాలొచ్చాయి. కింగ్ ఆఫ్ కోత, గాండీవధారి అర్జున, బెదురు లంక.. మూడూ మూడే! ఏ ఒక్కటి కూడా `యావరేజ్` మార్క్‌ని చేరుకోలేకపోయింది. కింగ్ ఆఫ్ కోత… దుల్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచే ప్రమాదంలో పడింది. వరుణ్ తేజ్ `గాండీవధారి..` పరిస్థితి కూడా అంతే. వీటి మధ్య ఫ్లాప్ సినిమా బెదురులంక కూడా జస్ట్ ఓకే అనుకొనే పరిస్థితికి వచ్చింది. అయినా కలక్షన్లు లేవు. వచ్చే వారం ఖుషి రిలీజ్ అవుతోంది. దానిపైనే ఆశలు పెట్టుకొన్నారంతా. ఇదో లవ్ స్టోరీ. కుర్రాళ్లకు ఎక్కితే… నెక్ట్స్ లెవిల్ కి వెళ్తుంది. విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఈ ముగ్గురికీ ఈ సినిమాతో హిట్టు కొట్టడం చాలా కీలకం.
విజయ్‌కి ఈమధ్య వరుస వైఫల్యాలు తగులుతున్నాయి. ఆశలు పెట్టుకొన్న సినిమా ఏదీ బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోతోంది. లైగర్ విజయ్‌కి పెద్ద దెబ్బ. పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుదామనుకొన్న విజయ్‌కి లైగర్ రూపంలో డిజాస్టర్ ఎదురైంది. విజయ్ పని అయిపోయింది అనుకొన్న వాళ్లకు విజయ్… ఓ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది…ఖుషితోనే జరగాలన్నది విజయ్ తాపత్రయం.
సమంత కొత్త కథలవైపు ప్రయాణం చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ స్టోరీలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. అయితే యశోద, శాకుంతలం రూపంలో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. సమంత అనారోగ్యం కూడా ఆమె దూకుడిని తగ్గించింది. ఇది వరకటి గ్లామర్ సమంతలో లేదన్నది ఆమె అభిమానులు సైతం ఒప్పుకొంటారు. అలాంటి సమంత చాలా కాలం తరవాత ఓ లవ్ స్టోరీ చేసింది. ఇది వరకటి ఫామ్ లో సమంత రావాలన్నా, మునుపటి కాన్ఫిడెన్స్ తనలో కనిపించాలన్నా ఓ క్లీన్ హిట్ కావాలి.
నిన్ను కోరి, మజిలి చిత్రాలతో శివ నిర్వాణ ఆకట్టుకొన్నాడు. క్లాస్ డైరెక్టర్ అనే ముద్ర పడింది. అయితే టక్ జగదీష్ తో ఒక్కసారిగా తుస్సుమన్నాడు. ఈ సినిమా తరవాత శివ నిర్వాణ ప్రతిభపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఖుషి ప్రాజెక్టుని చేజిక్కించుకొన్ని, దాన్ని కలర్ ఫుల్‌గా తీర్చిదిద్దడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. పాటలు కూడా తనే రాశాడు. తనకి ఇప్పుడు ఈ హిట్టు చాలా చాలా అవసరం. ఖుషి ఫలితం ఈ ముగ్గురి కెరీర్లను నిర్దేశిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఈ ముగ్గురికే కాదు.. పరిశ్రమకి సైతం హిట్టు అవశ్యమే. ఎందుకంటే ఆగస్టులో అన్నీ వైఫల్యాలే. డబ్బింగ్ సినిమా జైలర్ ని మినహాయిస్తే… బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించలేదు. ఈసారి ఓ క్లీన్ హిట్ తో.. తెలుగు సినిమా కాస్త ఊపిరి తీసుకోవాలంటే… ఖుషితో హిట్ పడాలి.