గన్నవరంలో పరిస్థితి క్లిష్టంగా మారుతూండటంతో .. పార్టీలో మరో సీనియర్ నేత అయిన దుట్టా రామచంద్రరావును అయినా పార్టీ మారకుండా చూసేందుకు వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని రాయబారానికి పంపింది. ఆయన దుట్టా రామచంద్రరావు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తర్వాత బయటకు వచ్చి దుట్టా వైసీపికి విధేయుడని గన్నవరంలో పార్టీ విజయానికి పని చేస్తారని చెప్పుకొచ్చారు. కానీ దుట్టా రామచంద్రరావు మాత్రం అలాంటి మాటలేం చెప్పలేదు.
నియోజకవర్గంలో పార్టీ విషయాలు మాట్లాడేందుకు మూడు నెలల క్రితమే సీఎం జగన్ తనను పిలిచారని … ఆ సమయంలో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా సీఎం జగన్కు చెప్పడం జరిగిందని అన్నారు. ఈరోజు కూడా బాలశౌరితో భేటీ అదే విషయాలు చెప్పానని తెలిపారు. అంటే.. వంశీతో కలిసి పని చేసే పరిస్థితి లేదని.. ఆయనకు టిక్కెట్ ఇస్తే .. గెలుపు కోసం సహకరించడం అనేది సాధ్యం కాదని తేల్చేసినట్లయింది. యార్లగడ్డ పార్టీ మారిపోవడంతో దుట్టా కూడా వెళ్లిపోతారన్న చర్చ జరుగుతోంది. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు.. వైసీపీ కార్యకర్తలకు చుక్కలు చూపించారు. చాలా కేసులు పెట్టించారు.
దీంతో ఆయనను సమర్థించడానికి వైసీపీ నేతలు కూడా రెడీగా లేరు. వంశీతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారు మాత్రమే ఉన్నారు. రేపు ఎన్నికల నాటికి వారు కూడా ఆయన వైపు ఉంటారా లేదా అన్నది తెలియదు. మరో వైపు దుట్టా .. పార్టీలోనే ఉన్నా.. వంశీ కి టిక్కెట్ ఇస్తే మాత్రం .. యార్లగడ్డకే పని చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గన్నవరం వైసీపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.