ప్రజలు రాష్ట్రానికి మేలు చేస్తారని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. వారి ఓట్లతో రాజ్యసభ సభ్యులను మాత్రం ఇతర రాష్ట్రాల వారిని ఎంపిక చేశారు జగన్ రెడ్డి. పరిమళ్ నత్వానీ ఏపీకి మరోసారి రాలేదు. నిరంజన్ రెడ్డి జగన్ రెడ్డి కేసుల కోసం హైకోర్టు,, సుప్రీంకోర్టు మధ్య తిరుగుతూంటారు. ఆయన ఏపీకి రారు. వచ్చినా జగన్ కేసుల కోసమే. మరో ఎంపీ కృష్ణయ్య.. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసిపోయి రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు బీసీలకు వ్యతిరేకమని ఆయన చురుగ్గా ప్రకటనలు చేయడమే కాదు.. ఆ పార్టీలకు వ్యతిరేకంగా కొన్ని చర్యలు చేపడుతున్నారు.
బీసీ సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని పెట్టుకుని చాలా కాలంగా రాజకీయ పలుకుబడి పెంచుకున్న ఆయన … చాలా అవకాశాలు పొందారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీలో చేరి… ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మళ్లీ టిక్కెట్ రాదని తెలియడంతో అన్ని పార్టీల్లో టిక్కెట్ కోసం తిరిగారు. చివరికి కాంగ్రెస్ లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేశారు. ఘోరపరాజయం ఎదురు కావడంతో ఆయన తర్వాత కాంగ్రెస్ కు వ్యతిరేకమయ్యారు. కేసీఆర్ ను పొగుడుతూ తిరిగారు. ఎలా పట్టారో కానీ వైసీపీ నుంచి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారు.
ఇప్పుడు మళ్లీ ఆయన కాంగ్రెస్ కు పని చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. బీసీలకు అనుకూలంగా కాంగ్రెస్ ఉందన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా ధర్నాలకూ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆయనను కంట్రోల్ చేయడానికి వేసీపీ ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. ఆయన తమ పార్టీ ఎంపీ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.