ఏపీలో జిల్లాలో మెడికల్ కాలేజీ పెడతానని శంకుస్థాపనలు చేసి.. చివరికి అతి కష్టం మీద ఓ నాలుగు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి అనుమతి తీసుకు వచ్చారు. కానీ ఈ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవట . అందుకే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైనా సరే… లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిందేనని జీవో ఇచ్చింది. బడుగు బ లహీనవర్గాలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతూంటే… ప్రభుత్వం సమర్థించుకోడానికి ఫ్యాక్ట్ చెక్ ద్వారా తన వాదన వినిపించింది. అందులో ఎప్పుడూ చెప్పే ఆవుకథ చెప్పి… చివరికి విద్యార్థులు కట్టేఫీజులతో కళాశాలు నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు.
సాధారణంగా ప్రైవేటు కాలేజీలు ఈ పని చేస్తాయి. ప్రభుత్వ కాలేజీలు ఉన్నది … ప్రజలకు సాయం చేయడానికి. చదువు కొనలేని వారికి అవకాశం కల్పించడానికి. ప్రభుత్వ కాలేజీ అంటే… అతి తక్కువ పీజు ఉంటుందనే నమ్మకంతో ప్రజలు ఉంటారు. ఏటా అరవై, డెబ్భై లక్షలు ఫీజులు పెడితే ఇక ప్రభుత్వ కాలేజీల్లోనూ సామాన్యులు చదువుకునే పరిస్థితి ఉంటుందా? . ఈ డబ్బులన్నీ కాలేజీల నిర్వహణకు ఖర్చుపెడతామని అంటున్నారు. కాలేజీల నిర్మాణానికి అప్పులు తెచ్చి… నిర్వహణకు ఫీజులు విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తే ఇక ప్రభుత్వం చేసేదేంటి ?.,
కేంద్ర ప్రభుత్వం జిల్లాలో మెడికల్ కాలేజీకి చాన్సు ఇచ్చింది. తెలంగాణలో పాతిక మెడికల్ కాలేజీల వరకూ ప్రారంభించారు. ఏపీలో నాలుగు ఇంకా పూర్తి స్థాయిలో కట్టకముందే.. ఓ పదిహేను కాలేజీలకు శంకుస్థాపనలు చేసి.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ అని మార్చేశారు. ఇప్పుడు పేదలకు వైద్యవిద్య అందుబాటులో లేకుండా చేస్తున్నారు. మొత్తం వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేయాలో … పేదలను ఎలా పేదలుగా ఉంచాలో ఈ ప్రభుత్వం పక్కాగా చేసి చూపిస్తోంది.