ఏపిలో తెదేపా ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాతోనే కాకుండా మిత్రపక్షమయిన బీజేపీతో కూడా యుద్ధం చేయవలసి రావడం విచిత్రంగానే ఉంది. రైల్వే, ఆర్ధిక బడ్జెట్ లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటి నుండి బీజేపీ నేతలు కూడా తెదేపాపై యుద్ధం ప్రకటించారు. బీజేపీ మహిళా నేత పురందేశ్వరి రాజధాని, పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులకి లెక్కలు చెప్పమని అడిగారు. దానికి వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు ఘాటుగా జవాబు చెప్పారు. కనుక దానికి ఇప్పుడు బీజేపీ స్పందించవలసి ఉంది కనుక ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కె. శాంత రెడ్డి జవాబిచ్చారు.
“అమరావతి భూములపై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి లేకుంటే ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందున మాకు కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. మా పార్టీ నేత పురందేశ్వరి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే, కొందరు తెదేపా నేతలు ఆమెను తీవ్రంగా విమర్శించారు. కేంద్రప్రభుత్వం ఆమోదించిన పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ లేదు. ఆ కారణంగానే ఆ ప్రాజెక్టుకి అవరోధాలు ఎదురవుతున్నాయి. అదే విషయం పురందేశ్వరి చెపితే ఆమె గురించి తెదేపా నేతలు అవహేళనగా మాట్లాడారు. అది సరికాదు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడం లేదంటూ తెదేపా నేతలు అబద్దపు ప్రచారాలు చేయడం మానుకోవాలి. దాని వలన ఇరు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయి,” అని ఆమె అన్నారు.
రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసున్న అనేక కారణాల చేత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. అది గమనించి వారి ఆగ్రహాన్ని చల్లార్చి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే తెదేపా, బీజేపీలు ఒకదానిపై మరొకటి ఈవిధంగా విమర్శలు చేసుకొంటాయి. కానీ అవి నేటికీ తమ స్నేహాన్ని యధాప్రకారం కొనసాగిస్తూనే ఉండటం గమనార్హం. పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు వంటి బీజేపీ నేతలు తెదేపాపై ఆరోపణలు చేయడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. వారు ఆరోపణలు చేసినప్పుడు తెదేపా నేతలు కూడా అంతే ధీటుగా ప్రత్యారోపణలు చేస్తుంటారు. అయినా వాటి వలన కూడా ఆ రెండు పార్టీల స్నేహం దెబ్బతినకపోవడం ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతోంది. ఒకపక్క ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్న సమయంలోనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు సమర్ధతని పొగడకుండా తిరిగి వెళ్లరు. అంటే రాష్ట్రంలోని సమస్యలు, తమ వైఫల్యాలు, హామీల నుండి ప్రజల దృష్టిని మళ్ళించి వారిని మభ్య పెట్టడానికే ఆ రెండు పార్టీల నేతలు ఈవిధంగా ఒకరిపై మరొకరు విమర్షలు చేసుకొంటున్నట్లు అనుమానించవలసి వస్తుంది.