మలయాళ చిత్రం హృదయంతో పాపులర్ అయ్యాడు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ సినిమాలోని `దర్శనా..` పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ పాటకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఒక్క పాటతో.. హేషమ్కి మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో తను చేసిన తొలి సినిమా `ఖుషి`. ఈ సినిమాలో పాటలకు సైతం మంచి స్పందన వస్తోంది. నా రోజా నువ్వే… అయితే మార్మోగిపోతోంది. మిగిలిన పాటలూ ఓకే అనిపించాయి. ఖుషి ఒక్కటే కాదు. తన చేతిలో మరో మూడు తెలుగు సినిమాలున్నాయి. నాని హీరోగా రూపొందుతున్న `హాయ్ నాన్న`కి తానే సంగీత దర్శకుడు. శర్వానంద్ సినిమా కూడా తన చేతిల్లోనే ఉంది. ఖుషి హిట్టయితే.. అబ్దుల్వాహబ్ తెలుగు సంగీతానికి ఓ ఆప్షన్ అవ్వగలడు.
ఎందుకంటే మనకు సంగీత దర్శకుల కొరత ఉంది. తమన్, దేవిశ్రీ మినహాయిస్తే చెప్పుకోదగిన సంగీత దర్శకులు లేరు. పెద్ద సినిమాలతో వాళ్లుబిజీ. చిన్న సినిమాలకు, ముఖ్యంగా లవ్ స్టోరీలకూ స్వచ్ఛమైన ట్యూన్స్ అందించే స్వర కర్తలు తక్కువగా ఉన్నారు. తమన్, దేవిశ్రీ పాటల్లో మొనాటిలీ వచ్చేస్తోంది. వాళ్ల మధ్య కాస్త ఫ్రెష్నెస్ కావాలంటే.. కొత్త సంగీత దర్శకులు వినిపించాలి. వాహబ్ ఆర్కెస్ట్రైజేషన్ కొత్తగా అనిపిస్తోంది. ట్యూన్స్ కూడా వినగానే నచ్చేసేలా ఉంది. ఇదే ఎఫెక్ట్ కొన్నాళ్ల వరకూ కొనసాగితే.. తను స్థిరపడగలడు కూడా. అయితే.. ఎంత టాలెంట్ ఉన్నా, ట్రాక్ లో ఉండాలి. అలా ఉండాలంటే హిట్టు పడాలి. ఖుషి తో వాహబ్ కి హిట్టు పడితే మాత్రం కొన్నాళ్లయినా టాలీవుడ్ లో ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది.