బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అసెంబ్లీ కి పోటీ చేయడానికి గాను 115 స్థానాల అభ్యర్థులను ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొందరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అభ్యర్థులకు ప్రజల్లోకి వెళ్ళడానికి సమయం దొరుకుతుందని, అంతర్గత సమస్యలను చక్కబెట్టడానికి సమయం దొరుకుతుందని భావించిన కేసీఆర్ కు – టికెట్ దక్కని బీఆర్ఎస్ నేతల నుండి తలనొప్పులు ఎదురవుతున్నాయి. రోజు రోజుకి వీరి అసమ్మతి రాగాలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా పలువురు బీఆర్ఎస్ నేతలు మీడియా సాక్షిగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
బేతి సుభాష్ రెడ్డి:
ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కెసిఆర్ ని టార్గెట్ గా చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేకపోతుని బలిచ్చే ముందు తనకు కనీసం మంచినీళ్లు తాగిస్తారని, అలాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీని ఉరి తీసే ముందు తనకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారని తన విషయంలో అటువంటి చివరి అవకాశం కూడా పార్టీ అధినాయకత్వం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు సుభాష్ రెడ్డి. అయితే మరో 10 రోజులపాటు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతానని ఆ తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటానని బాహటంగానే వ్యాఖ్యానించారు సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి.
రాజయ్య:
కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించిన నాటినుండి మీడియాలో ప్రముఖంగా హైలెట్ అవుతున్న అసమ్మతి నేత రాజయ్య. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ని కడియం శ్రీహరికి ప్రకటించడంతో మీడియా ముందే ఏడ్చిన రాజయ్య ఇప్పుడు మందకృష్ణ తదితర కులనేతలను తనకు మద్దతుగా కలుపుకుంటూ కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతూ అసమ్మతి వినిపిస్తున్నారు. తాను నేరుగా అనకుండా మందకృష్ణ చేత రాజయ్యకు టికెట్ ఇవ్వకపోవడం మాదిగ జాతి అస్తిత్వాన్ని ఉనికిని దెబ్బతీయటమే అంటూ వ్యాఖ్యలు చేయిస్తున్నారు రాజయ్య. రాజయ్య మాత్రం తనకు ఇప్పటికీ చివరి నిమిషంలో టికెట్ వస్తుందన్న ఆశ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
మదన్ రెడ్డి:
ఇక మరొక నేత మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా టికెట్ ఆశించి భంగ పడ్డారు. ఈ స్థానం నుండి సునీత రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉండడంతో పరోక్షంగా ఆమె పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు మదన్ రెడ్డి. తనకు టికెట్ దక్కకపోతే నియోజకవర్గంలో పార్టీ ముక్కలైపోతుందని అంటున్నారు మదన్ రెడ్డి.
వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా ఇదే విధంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. వీరిలో చాలా వరకు ఆఖరి నిమిషంలో పార్టీ ఫిరాయించడానికి ఇటు కాంగ్రెస్ తో అటు బిజెపితో ఇప్పటికే టచ్ లో ఉన్నట్లు సమాచారం.