ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ప్రభుత్వ ఎన్ని సార్లు మోసం చేస్తుందో తెలియదు కానీ… నమ్మించి ప్రభుత్వం గొంతు కోస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులు.. భయంతో ప్రభుత్వానికి కొమ్ము కాస్తూండటంతో అంతా ఇష్టారాజ్యంగా ఉద్యోగుల ప్రయోజనాలతో ఆటలాడుతున్నారు. తాను అధికారంలోకి రాగానే వారంలో సీపీఎస్ రద్దు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగుల్ని రాచి రంపాన పెడుతున్న జగన్ రెడ్డి జీపీఎస్ పేరుతో మరో విధానం తెచ్చి వారి నెత్తిపై బండ వేయడనికి రెడీ అయ్యారు.
ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా.. కొత్తగా తెస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ లో దారుణమైన నిబంధనలు పెట్టి తెర ముందుకు తెచ్చారు. పేరులోనే గ్యారంటీ ఉంటుంది కానీ… ప్రభుత్వ పథకాలకు నిబంధనలు పెట్టి అందర్నీ ఎలిమినేట్ చేసినట్లుగా… ఇందులోనూ చేశారు. ఈ జీపీఎస్ చూసి.. ఉద్యోగుల కడుపు మండిపోతోంది. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం.. బాగుందని ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి ఏపీలో ఉన్న ఉద్యోగులంతా సీపీఎస్ ఉద్యోగులు కాదు, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారే సీపీఎస్ ఉద్యోగులు. అంతకు ముందు సర్వీసులో చేరిన వారికి మామూలు పెన్షన్ వస్తుంది.
వీరందరి ఓట్లను సీపీఎస్ రద్దు హామీతో పొందిన జగన్ రెడ్డి… వారి ప్రయోజనాల్ని మాత్రం మరింతగా దిగజారుస్తున్నారు. ఒప్పుకుంటే జీపీఎస్ లేకపోతే.. సీపీఎస్ లోనే ఉండాలనే ఆఫర్ ఇస్తున్నారు. ఎన్నికల హామీని నెరవేర్చకపోతే రాజీనామా చేసి పోయే రాజకీయ సంస్కృతి రావాలని జగన్ రెడ్డి ప్రచారంలో ప్రతీ చోటా చెప్పేవారు. కానీ అడ్డగోలుగా మోసం చేస్తూ ఆయన పదవిలోనే అతుక్కుపోయారు.
ఓ వైపు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు.. మరో వైపు ప్రభుత్వ వేధింపులు… ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అడిగితే కేసులు… పాపం ఏపీ ఉద్యోగులు అని జాలి చూపడం తప్ప…. వారికి ఎవరూ మద్దతు కూడా ఇవ్వడం లేదు.