బీఆర్ఎస్లో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. నిన్నామొన్నటి వరకూ నోరు మెదపని వారు కూడా ఇప్పుడు హైకమాండ్ పై చెలరేగిపోతున్నారు. తమను మోసం చేశారని.. ఏదో ఒకటి చేయకపోతే తాము చేయాలనుకున్నది చేస్తామని అటున్నారు. వీరు తమకు మద్దతుగా కుల సంఘాలను రంగంలోకి దింపడంతో బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
మైనంపల్లి హన్మంతరావు ధిక్కార స్వరంపై కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. పైగా ఆయనను బుజ్జగిస్తున్నాన్నప్రచారం జరుగుతోంది. దీంతో ఇతరులకూ ధైర్యం వచ్చింది. అదే సమయంలో కేసీఆర్ నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేలను చేయిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నరు. దీంతో బీఆర్ఎస్లోనే కనీసం 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లు మారుస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో బలప్రదర్శన చేసేందుకు నేతల తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్పులు ఉంటాయన్న ప్రచారంతో మరింత ఉత్సాహంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొంత మంది నేతలు కులు సంఘాలను రంగంలోకి దింపడం బీఆర్ఎస్లో చర్చనీయాంశమయింది. తెలంగాణలో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించలేదు. వారు ఆందోళనలు చేయడంతో టిక్కెట్ ఆశిస్తున్న ముదిరాజ్ నేతల్ని పిలిచి కేసీఆర్ మాట్లాడాల్సి వచ్చింది. తాటికొండ రాజయ్య కూడా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మద్దతుతో ప్రయత్నిస్తున్నారు. ఇంక పలువురు నేతలు అదే పని చేస్తూండటంతో ముందు ముందు బీఆర్ఎస్లో ఈ పంచాయతీలు ఎక్కువ అవకాశం ఉంది.
కేసీఆర్ ధిక్కారాలపై కఠినంగా వ్యవహరించడం లేదు. కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే అందర్నీ కంట్రోల్ చేయాలన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తోంది.