ఓ సినిమా ఫ్లాప్ అయితే… హీరోలు, దర్శకులు పారితోషికాలు వెనక్కి ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అలాంటప్పుడే వాళ్లలోని రియల్ హీరోలు బయటకువస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్లూ తక్కువ కాదని నిరూపించింది సమంత.
ఖుషి సినిమాలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదల కావాల్సిన సినిమా ఇది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సమంత అనారోగ్యంతో ఈ సినిమా చాలా చాలా ఆలస్యమైంది. ఓ సినిమా ఎంత ఆలస్యమైతే.. అంతగా నిర్మాతలపై వడ్డీల భారం పెరుగుతుంటుంది. ఖుషి లాంటి సినిమాకి అది మరింత ఎక్కువ. అందుకే తన వల్ల సినిమా ఆలస్యమైనందుకు పరిహారంగా సమంత తన పారితోషికాన్ని కొంత తగ్గించుకొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకొంది. మిగిలిన సొమ్ములో సగం సినిమా మధ్యలో అందింది. బాకీ పారితోషికం దాదాపు కోటి రూపాయలు మాత్రం మాఫీ చేసినట్టు సమాచారం. శాకుంతలం విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమా నిర్మాత గుణ శేఖర్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ సమయంలోనూ కొంత పారితోషికాన్ని తాను వదులుకొంది.