తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగిస్తున్నారని పెద్ద పదవులు ఆశ చూపుతున్నారని జరుగుతున్న ప్రచారం అంతా మీడియాలోనే ఉందని.. బీఆర్ఎస్ హైకమాండ్ వైపు నుంచి ఎవరూ తుమ్మలను సంప్రదించలేదని తెలుస్తోంది. భారీ బలప్రదర్శన చేసినా కేసీఆర్ పట్టించుకోలేదు. ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటన చేసినప్పటికీ బీఆర్ఎస్ లో స్పందన లేకపోవడంతో ఇక తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ మధ్యలో రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని.. బుజ్జగించిన వృధానేనని కేసీఆర్ అనుకుంటున్నరని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికలకు ముందు తుమ్మలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చి.. జిల్లాపై పెత్తనం ఇస్తే.. తర్వాత ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారని..ఆయన వల్ల పార్టీకి పెద్దగా లాభం లేదని బీఆర్ఎస్ పెద్దలు ఓ అంచనాకు వచ్చారంటున్నారు. అందుకే భారీ పదవులు ఆశ చూపి పార్టీలో ఉండాలని ఆయనపై ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని ఫిక్సయినట్లుగా చెబుతున్నారు. తుమ్మల తాను పాలేురలో పోటీ చేస్తానంటున్నరు. అయితే ఈ సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరులో పోటీకి రెడీ అవుతున్నారు.
సహజంగానే అక్కడ రెడ్డి సామాజికవర్గం నేతలు గెలుస్తూ ఉంటారు. కమ్మంలో కమ్మ సామజికవర్గం గెలుస్తూ ఉంటారు. ఈ కారణంగా తుమ్మలను ఖమ్మంలో పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత.. తుమ్మల కాంగ్రెస్ లో చేరే తేదీపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.