సెప్టెంబరులో వరుసగా అన్నీ క్రేజీ సినిమాలే వస్తున్నాయ్. కానీ క్రేజ్ కా బాప్ మాత్రం సలార్ ఒక్కటే. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రూపుదిద్దుకొన్న చిత్రమిది. సెప్టెంబరు 28న వస్తోంది. అంటే నెల రోజుల సమయం కూడా లేదు. విచిత్రం ఏమిటంటే.. ఈ సినిమా బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదు.
ప్రభాస్ సినిమా, అందులోనూ ప్రశాంత్ నీల్ దర్శకుడు.. ఇలాంటి సినిమాకి బిజినెస్ క్లోజ్కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. కాకపోతే.. హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ల అత్యాస వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సినిమాపై అతి నమ్మకంతో.. అన్ని ఏరియాల్లోనూ భారీ రేట్లు చెబుతున్నారు. నైజాంలో ఈసినిమా కొనడానికి పోటీ గట్టిగానే ఉంది. దిల్ రాజు, ఏసియన్ సునీల్ పోటీకి దిగారు. అయితే.. నైజాం కోసం రూ.70 కోట్లు అడుగుతున్నారు. ఇది కనీ విని ఎరుగని రేటు. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఆస్తులు అమ్మేసుకోవాలి. సీడెడ్ లో కూడా రికార్డు స్థాయి ధర చెబుతున్నారు. అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి.
ఈమధ్య బయ్యర్లకు గట్టి షాకులు తగిలాయి. ఎంత క్రేజ్ సినిమా అయినా ఆచి తూచి స్పందిస్తున్నారు. అందుకే `సలార్` విషయంలో రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు. హోంబలే వాళ్లే ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకోవాలనుకొంటున్నారని, అందుకే ఇంతింత రేట్లు చెబుతున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సలార్.. ఇండియాలో రూపుదిద్దుకొన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. ఇలాంటి సినిమాని వీలైనంత వరకూ అమ్ముకొని సేఫ్ అవ్వాలని చూస్తారు నిర్మాతలు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. ఆ రిస్క్ మొత్తం నిర్మాతలే తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే సినిమాని అమ్మడానికి ఇష్టపడడం లేదు.
అటూ ఇటూ అయితే మాత్రం హోంబలేకి గట్టి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అత్యాస వదులుకొని, కాస్త రీజన్ బుల్ రేట్లు చెబితే.. ఈ సినిమా రెండు రోజుల్లో హోల్ సేల్ గా అమ్ముడైపోతుంది.