తెలుగు సినిమా అంటే… ఎప్పుడూ హీరోయిజం, కమర్షియల్ సినిమాలే కాదు. సెంటిమెంట్ కీ తెలుగు సినిమా అగ్ర తాంబూలం ఇస్తూనే వచ్చింది. మరీ ముఖ్యంగా.. అన్నా చెల్లెళ్ల కథలకు పెద్ద పీట వేసింది. అగ్ర హీరోగా చలామణి అయిన ప్రతీ కథానాయకుడూ తన కెరీర్లో ఎప్పుడో ఓసారి ‘అన్న’ పాత్రలో మెరిసినవాడే. నిజానికి.. ఇలాంటి కథలే హీరోలకు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేస్తాయి. మహిళా ప్రేక్షకుల మన్ననలు పొందాలంటే… ఏ హీరో అయినా అన్నగా అవతారం ఎత్తాల్సిందే. మన హీరోలూ అదే చేశారు.
ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి జూనియర్ వరకూ ‘అన్న’లే అంతా. ఎన్టీఆర్ – సావిత్రి అన్నా చెల్లెళ్లుగా నటించిన ‘రక్త సంబంధం’ సిస్టర్ సెంటిమెంట్ కథలకు ఓ పేరా మీటర్. అక్కడి నుంచి ఎన్టీఆర్ చాలా చిత్రాల్లో అన్నయ్యగా మెప్పించాడు. అఖిల తెలుగు ప్రేక్షకులకు ‘అన్న’గా మారాడు. అక్కినేని ఖాతాలోనూ సిస్టర్ సెంటిమెంట్ కథలున్నాయి. శోభన్ బాబు, కృష్ణ, కృష్ఱంరాజు.. వీళ్లు కూడా ఎప్పుడూ ఈ అవకాశాన్ని వదులుకోలేదు. మాస్ హీరోగా పేరు తెచ్చుకొన్న చిరంజీవి సైతం తన పునరాగమనం కోసం ‘హిట్లర్’గా అవతారం ఎత్తాల్సివచ్చింది. ఐదుగురు చెల్లెమ్మలకు అన్నయ్యగా చిరు నటన మెప్పించింది. ‘లంకేశ్వరుడు’ కూడా ఓరకంగా అన్న కథే. బాలయ్య ‘ముద్దుల మావయ్య’ కథనీ చెల్లెలు సెంటిమెంట్ తో నింపేశారు. రాఖీ వచ్చిందంటే ఏదో ఓ టీవీ ఛానల్ లో వచ్చే సినిమా ‘పుట్టింటికి రా చెల్లి’. ‘అన్నవరం’లో పవన్ కల్యాణ్ అన్నే. రాజశేఖర్ కెరీర్లో ‘గోరింటాకు’ ఓ ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. చెల్లెమ్మలందరికీ ఈ సినిమా ఓ రాఖీ కానుక. ‘రాఖీ’ అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ ‘రాఖీ’నే. ఈ సినిమాతో ‘అన్న’లకు ఆదర్శంగా నిలిచాడు తారక్. మహేష్ ‘అర్జున్’లో ఓ మంచి అన్నగా కనిపించాడు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కథలు.. ఇంకెన్నో సినిమాలు.. మరెందరో అన్నలు.
ఇప్పుడంటే సినిమాలన్నీ భారీ, కమర్షియల్, యాక్షన్ కథలకు పెద్ద పీట వేస్తున్నారు కానీ గతంలో యేడాదికి ఒక్కటైనా సిస్టర్ సెంటిమెంట్ సినిమా వచ్చేది. వచ్చిన ప్రతీ కథా.. మినిమం గ్యారెంటీ సినిమాగా నిలిచేది. కోడిరామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకులు ఈ తరహా కథలకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచేవారు. ఇప్పుడు ఆ దర్శకులూ లేరు. ఆ కథలూ లేవు. ఎప్పుడు రాఖీ పండగ వచ్చినా పాత సినిమాల్ని తలచుకోవడమే తప్ప.. వెండి తెరపై నికార్సయిన సిస్టర్ సెంటిమెంట్ సినిమాలే కనిపించడం లేదు. థియేటర్లకు దూరం అయిపోతున్న ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ కదలాలంటే. ఇలాంటి కథలే రావాలేమో..?