షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటున్నారు. సోనియాతో భేటీకి భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఆమె ఇవాళ సోనియాను కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయాలు వద్దని ఏపీలో అయితే సరే అని… కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన షరతుకు షర్మిల ఓకే చేసిందని చెబుతున్నారు. ఆమె పార్టీలో విలీనం తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తారని అంటున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టి మూడు వేల కిలోమటీర్లకుపైగా పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. పార్టీని ఓ మాదిరిగా నిర్మించుకోలేకపోయారు. కనీసం తాను పోటీ చేయాలనుకున్న సీటులోనూ ప్రభావం చూపలేకపోయారు. పాలేరులో ఆమె పోటీ చేస్తే మూడు శాతం ఓట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆమె తీవ్రంగా మథనపడుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఒక్కటే షరతు పెట్టింది.. తెలంగాణలో రాజకీయాలు వద్దే వద్దని.. ఏపీకి అయితే విలీనం ఓకే అని.. లేకపోతే మీ దా రి మీరు చూసుకోవచ్చని తేల్చేసింది.
షర్మిల ఇప్పుడు ఎటూ పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణలోనే కొనసాగితే పరువు పోతుంది.. ఏపీలో అయితే రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. ఏపీలో పార్టీ కొద్దిగా బలపడినా.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆమెకు మహర్దశ పడుతుంది. అన్నతో రాజకీయంగా విబేధించాలని డిసైడయిన తర్వాత.. ఇక ముందూ వెనుకా చూడటం ఎందకన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. షర్మిల పార్టీ విలీనంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.