రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ కోర్టు చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదల చేసిన `టైగర్` టీజర్ స్టువర్టుపురం వాసుల్ని అవమానించేలా, ఎరుకల సామాజిక వర్గ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. `సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్` లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని నిర్మాతల్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా స్టువర్టుపురం వాసుల్ని, ఎరుకల సామాజిక వర్గ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందని చుక్కా రాజ్ గోపాల్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వాద ప్రతివాదనలకు నాలుగు వారాలు గడువు ఇచ్చింది. స్టువర్ట్ పురంకి చెందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒకప్పుడు స్టువర్టుపురం దొంగలకు అడ్డా. ఇప్పుడు ఆ వాతావరణమే అక్కడ కనిపించడం లేదు. అలాంటప్పుడు ఈ సినిమా ఎలా తీస్తారు? ఆ గ్రామ ప్రతిష్టని ఎందుకు భంగం వాటిల్లేలా చేస్తారన్నది హైకోర్టు ప్రశ్న. దీనిపై నిర్మాతలు సమాధానం చెప్పాల్సివుంది.