ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు దేశ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. అందరూ ముందస్తు ఎన్నికల కోసం అని.. జమిలీ ఎన్నికల కోసం .. యూసీసీ బిల్లు కోసం అని విశ్లేషిస్తున్నారు. కానీ కేంద్రం వైపు నుంచి కానీ.. బీజేపీ వైపు నుంచి కానీ ఒక్క లీక్ కూడా రాలేదు. ఒక్క చిన్న హింట్ కూడా రావడం లేదు. దీనికి కారణం .. ఎవరికీ తెలియకపోవడమే. బహుశా మోదీ, అమిత్ షాలు ఇద్దరికి మాత్రమే తెలిసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరిద్దరూ చెప్పినట్లుగా మిగతా వారు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ప్రకటనల్లోనూ విషయం ఏదీ బయటకు తెలియడం లేదు.
మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 17వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని సూచించారు. కోవింద్ తో నడ్డా సమావేశం అయ్యారు. బహుశా నివేదిక కూడా రెడీ అయి ఉంటుందని.. కోవింద్ నేతృత్వంలోని కమిటీ ముద్ర కోసమే.. అలా చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు అందరూ ఢిల్లీలోనే ఉండాలని.. రాష్ట్రాల పర్యటనలు రద్దు చేసుకోవాలని.. మిగతా అన్ని పనులు రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది కేంద్రం.
ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేకుండా ఏ శాఖ కార్యదర్శి ఢిల్లీ వదిలి వెళ్లరాదంటూ హుకూం జారీ చేసింది. ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానున్న నేపథ్యంలో అధికారులపై ఈ ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. మొత్తంగా. ఓ పెద్ద సంచలనం అయితే చేయబోతున్నారు. అదేమిటన్నది అర్థం కావడం లేదు. జమిలీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. అది సాద్యమా కాదా అన్నదానిపై ఇప్పటికే ఎన్నో సందేహాలున్నాయి. చివరిగా ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.