జైలర్ సినిమా విడుదలకు మందు చెన్నైలో జరిగిన ఫంక్షన్లో రజనీకాంత్ చెప్పిన ఓ డైలాగ్ ఏపీలోనూ బాగా పాపులర్ అయింది. ‘మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి’ అని తమిళంలో చెప్పి.. తెలుగులో ‘అర్థమైందా రాజా?’ అని ఎండింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ పాపులర్ అయింది. జైలర్ సినిమాలోనూ అర్థమైందా రాజా డైలాగ్ ఉంది. సందర్భానుసారంగా ఈ డైలాగ్ ను అందరూ వాడేస్తున్నారు. తాజాగా చంద్రబాబు కూడా వాడేశారు.
కాకినాడలో జరిగిన జోన్ 2 సమావేశంలో చంద్రబాబు జగన్ రెడ్డి పాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో కరెంట్ కోతల అంశాన్ని ప్రస్తావించారు. ” ఈ రోజు చెపుతున్నా… కరెంట్ కోతలు లేని చోటు లేదు…..కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు….ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ! ” అని డైలాగ్ చెప్పడంతో కాకినాడ జోన్ సమావేశం దద్దరిల్లిపోయింది.
కరెంట్ కోతలు ఏపీలో విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని పెద్ద ఎత్తున జగన్ రెడ్డిపై తిట్ల దండకం అందుకుంటున్నారు. అందుకే చంద్రబాబు.. సింక్ అయ్యేలా చెప్పిన ఈ డైలాగ్ వైరల్ అవుతోంది.