జనరల్ గా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ రెండు. ఒకటి టీడీపీ, రెండు వైసీపీ. వీటికి అడిషనల్ గా ఉన్న జనసేన. మనం టీడీపీ వైపు చెవి పెట్టి విన్నాం అనుకోండి… ఏం జరుగుతుందో చూడండి. 2024 మాదే అన్నది చాలా కాన్ఫిడెంట్ గా సౌండ్ చేస్తుంది. ఇక వైసీపీ వర్గాల వారి నుంచి వినిపించే రొటీన్ డైలాగ్ మరొకటుంది. అదేంటంటే.. అంత మెజార్టీ రాక పోవచ్చు గానీ.. బొటాబొటిగా అయినా గెలిచి తీరుతాడు. ఈ సారి కూడా మావోడే. ఇది ఇటు వైపు వినిపించే లో గ్రేడ్ ఆన్సర్. ఇక జనసేన వర్గాల వారిది మరో ఊహల ఊట. వాళ్లదో లోకం. అయితే గోదావరిలో.. జనసేన.. కొంత మేర ప్రభావం చూపుతుందని చెప్పు కుంటున్నారు. ఈ జిల్లాల్లోని 34లో సగానికి సగం మా వోడు కొట్టేస్తాడని నమ్మ బలుకు తున్నారు..
డబ్బులు పంచాం గెలిచేస్తామన్న భావనలో జగన్
ఇవన్నీ అలా ఉంచితే. నిజంగానే జగన్ సిట్యువేషనే కాస్త బ్యాడ్ గా ఉంది చూస్తుంటే.. తానేదో చేసేస్తున్నానన్న భ్రమల్లో ఉండి.. అసలు సంగతి మరచి పోతున్నట్టుగా కొడుతోంది. ఆయన బేసిగ్గా ఏం నమ్ముతున్నారంటే.. మనమేదో పేదలకు డబ్బులు పంచేశాం ఇదే మనల్ని గట్టెక్కించే బ్రహ్మాస్త్రమని భావిస్తున్నట్టున్నారులా ఉంది. కానీ పేదలకు డబ్బులు పంచగానే సంతోషించే వాళ్లెవరూ లేరిక్కడ. ఈ పేదరికం అనే బ్రహ్మపదార్ధానికి ఒక నిర్వచనం అంటూ ఏమీ లేదు. ఒక వేళ ఉన్నా.. దాని కంటూ ఒక స్పష్టత లేదు. ఆ స్పష్టత తెచ్చే \ వచ్చే లోపల.. కొన్ని వర్గాల వారు బహు దూరమై పోతున్నట్టు తెలుస్తోంది.
వారిలో ఒక సారి పథకం వచ్చి పోయిన వాళ్లు. ఇక పూర్తిగా పథకాలు రాని వాళ్లు. మూడో వర్గం.. ఉద్యోగులు, నాలుగు యువత.. ఐదు అధికార దాహంతో ఉన్న కమ్మ సామాజిక వర్గీయులు.. ఆరు భవన నిర్మాణ కార్మికులు.. ఏడు మందుబాబులు.. ఇలా ఈ లిస్టు చాంతాడంత ఉంది.
ఉద్యోగులు దూరం !
ఒక సినిమా- బాగా తీయడం వేరు- దాన్ని కమర్షియల్ హిట్ గా మలచడం వేరు. ఇక్కడే జగన్ పాలన జై కొట్టించుకోవల్సింది కాస్తా నై కొట్టించుకుంటోన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు రావడం లేదు. ఇక అభివృద్ధి జరగటం లేదని వాపోతున్న వారు చాలా మందే ఉన్నారు. వీటిని జగన్ చాలా వరకూ గాలికి వదిలేసినట్టే కనిపిస్తోంది. ఉద్యోగులు మొన్నా మధ్య ఎక్కడి వరకూ వెళ్లారంటే.. జీతం పొందడం మా హక్కంటూ గవర్నర్ కి వినతిపత్రం సమర్పించే వరకూ. మరి పని చేయడం కూడా మీ హక్కే కదా? అనడిగితే వాళ్ల నుంచి నో ఆన్సర్. ఏతా వాతా చూస్తే జగన్ కి.. ప్రభుత్వ ఉద్యోగులను ఏమంతగా ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనే ఉన్నట్టు కనిపించడం లేదనుకుంటా. సచివాలయ వ్యవస్థ ద్వారా రాజధాని లేకున్నా పర్లేదంటుంటే.. ఇక వాలంటీర్లు ఉండగా ఈ ఉద్యోగులెందుకు దండగ.. అన్న భావన ఉండక పోతుందా ఏంటన్న కామెంట్ వినిపిస్తోంది. దీంతో ఎంప్లాయిస్ యాంగిల్లో ఆలోచించడం సో సోగానే కనిపిస్తోంది. మొన్నటి సీపీఎస్ కూడా ఏదో కంటి తుడుపు చర్యగానే కొడుతోంది.
దోపిడీ చేస్తున్నారని మందుబాబులూ ఆగ్రహం
మాకివన్నీ అక్కర్లేదండీ డెవలప్ మెంట్ ఏదీ? అనడిగేవాళ్లదొక అసంతృప్త రాగం. ఆది తాళం అంతెత్తున అదర గొడుతోంది. వీళ్లయితే.. మాకేం అక్క ర్లేదు. ఆ మౌలిక సదుపాయాల పనేంటో చూడమనండి చాలని అంటున్నారు. మందుబాబులదైతే.. మొన్నొకడు అంటాడు.. ఇదే గోదారమ్మ మీద ఆన.. ఈసారి గోదారి పుష్కరాలకు చంద్రబాబు ఆయన సతీమణిగానీ.. పుష్కర స్నానం చేయకుంటే నా పెళ్లాం మదన మనోహరికన్నా నేనెక్కువగా ప్రేమించే నా మందు మనోహరి మీదొట్టు.. అంటూ ఓ మందు* చూపుతో కూడిన ఛాలెంజ్ విసిరాడు. వాడి బాధల్లా ఒక్కటే మందు రేట్లు అమాంతం పెరగటమే. ఇందుకు జగన్ ప్రభుత్వం చెప్పే సొల్లేదీ వినే పరిస్థితుల్లో వాడు లేడు.
మోసం చేశారని నిరుద్యోగ యువత కూడా దూరం
యువత అయితే రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామంటే మేమంతా ఓట్లేశాం. కానీ, ఇప్పుడు చూస్తుంటే.. జగన్ సార్ మదిలో.. మా ఊసు ఉన్నట్టే లేదు. ఆయనకసలు వాలంటీర్ వంటి చిన్నా చితకా ఉద్యోగాల కల్పన తప్ప.. సరైన ఉద్యోగ నియామకాలు చేద్దామన్న ఆలోచనే లేదని వాపోతున్నారు వారు. అంతే కాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం ఇచ్చిన తీర్పునైనా.. సార్ సీరియస్ గా తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నారు. ఎంతైనా ఉద్యోగాభ్యర్ధులు కదా!? అయితే జగన్ వెంట అవ్వాతాతలు, వాలంటీర్లు, సగటు పేదింటి అక్కచెల్లెమ్మలు, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందిస్తున్న సంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు.. ఇలా కొన్ని వర్గాలతో పాటు.. రూరల్ లో ఇప్పటికీ అధికార పార్టీకి హోల్డ్ ఉన్నట్టుగా మాట్లాడు కుంటున్నారు. కానీ, ఇక్కడే చిన్న తేడాతో టీడీపీ దీన్నంతటినీ డెస్ట్రాయ్ చేయదన్న గ్యారంటీ ఏం లేదన్న టాకూ వినిపిస్తోంది.
పథకాలు తీసుకున్న వాళ్లకూ కోపమే – దానికి సవాలక్ష కారణాలు
కొందరు తీసుకుని కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్లున్నారు. ఒక పండ్లమ్ముకునే ముసలావిడ అంటది.. నాకు చేయూత డబ్బులు పడ్డాయ్. ఇంటి స్థలం వచ్చింది.. ఆపై ఇల్లు కట్టుకోడానికి డబ్బులు కూడా పడ్డాయ్.. అయినా సరే నేనేం జగనన్నకు ఓటెయ్యను అంటోందామె. కారణమేంటే అవ్వా! అంటే.. మాది వడ్రంగి పని. ఇసుక సరిగ్గా దొరక్క.. ఆపని ఇప్పుడేమంత జరక్క పోవడమేనంటోందామె..
ఇంకో కిరణా షాపు మహిళ చెప్పిన మాట మరీ విడ్డూరం. ఆమె ఒక గంట సేపు వెళ్లి ఫీజు రీఎంబర్స్ మెంట్ డబ్బు ఆ కాలేజీకి కట్టడానికి కష్టంగా ఉందంట. అందుకే ఈసారికి టీడీపీకి వేద్దామనుకుంటున్నాననీ చెప్పుకొచ్చింది. అదేంటమ్మా.. అలా అనేశావ్! ఒక వేళ నువ్వే మోహన్ బాబు స్థానంలో ఉన్నావే అనుకో.. ఏకమొత్తంగా నీకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయి ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టిందే అనుకో.. అప్పుడేం చేస్తా? అని అడిగితే.. నిజవేగానీ.. జగనన్న హయాంలో ఉద్యోగ అవకాశాలు ఉండటం లేదు కదండీ.. మా పాప ఇక్కడ జాబ్ చేయడానికి వీల్లేక బెంగళూరు వెళ్తోంది. అదే ఇక్కడే ఐటీ రంగం వచ్చి ఉంటే.. మాకెంతో హ్యాపీగా ఉండేదిగా అంటూ.. అసలు సంగతి బయట పెట్టింది. అంటే జగన్ ని వ్యతిరేకించడానికి సాకులు వెతుక్కుంటున్నారన్న మాట.. ఇలాటోళ్లంతా కలసి. ఒకడెదురయ్యాడు. టీటీడీ ఫారెస్టు డిపార్ట్ మెంట్ లో చేస్తాడట. 11 వేల జీతంతో ఎలా బతకాల్సార్. జీతాలు పెంచుతామని మాకు మాటిచ్చారు.. కానీ, పెంచలా. మేమంతా టీడీపీకి ఏసిపారదొబ్బుతాం అన్నాడతడు.. ఎంత మంది ఉన్నారయా మీరంతా అంటే ఓ నాలుగొందల మంది వరకూ ఉన్నామన్నాడు. ఇలాంటి అసంతృప్తులు బోలెడు. తీస్కున్నోళ్లు కొందరైతే.. ఏదీ రాలేదని ఏడ్చేవాళ్లు చాలా మందే. ఒక వేళ ఇవేవీ వద్దు.. అనుకునేవాళ్లయినా.. ఇటు వైపున్నారా? అంటే అలాంటిది కూడా ఏమీ కనిపించడం లేదు. వీళ్లంతా కాపులైతే.. జనసేన రావాలని, కమ్మలైతే.. టీడీపీ రావాలని.. ఇతర కులస్తులైతే.. జగన్ కాక మరెవ్వరొచ్చిన పర్లేదనీ అంటున్న విధం.. కని\వినిపించింది.
ఎలాగోలా రెండో సారి గెలుస్తారనుకుంటున్న వైసీపీ కార్యకర్తలు
ఇవన్నీ అటుంచి.. తన తండ్రిలా.. జగన్ బొటాబొటిగా అయినా గట్టెక్కి రెండో సారి రావడమే కరెక్టని ఫీలవుతున్న పార్టీ శ్రేణులు చాలా మందే ఉన్నారు. వాళ్ల మాటలను అనుసరించి చెబితే, ఇదో లాభదాయకమైన వ్యవహారంగా భావిస్తున్నారు. జనమెలాగూ మనల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు కాబట్టి.. వారినలా పక్కన పెట్టి.. పార్టీ కోసం ఇప్పటి వరకూ బట్టలు చించుకున్న వారి కోసం జగనన్న ఏదైనా చేసే అవకాశముందన్న ఆశావహ ఆలోచన వీరందరిదీ. దానికి తోడు రెండో సారి.. కూడా వైసీపీయే అధికారంలోకి వస్తే.. ఇక టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి.. ఇప్పట్లో మనల్ని కొట్టేవాడే ఉండడు కాబట్టి.. బేపికర్. అన్న యాంగీల్లోనూ కొన్ని ఆలోచనలు చెక్కర్లు కొడుతున్నాయ్.. ఓవరాల్ గా చూస్తే.. వైసీపీకి గ్రౌండ్ ఏమంత గొప్ప సపోర్టివ్ గా లేదు. చాలా చాలా టఫ్ సర్ఫేస్ కనిపిస్తోంది. ఇక్కడింకోటి కూడా ఉంది.. నెగిటివ్ కామెంట్ వినిపించినంత సౌండ్ గా పాజిటివ్ టాక్ వినిపించదు కాబట్టి.. కంచు మోత \ కనకపు మోతతో సరి పోల్చకండనే వాళ్లూ కనిపిస్తున్నారు. వీటన్నిటి నడుమ సాగుతోన్నఈ పోరాటంలో అంతిమ విజేతలెవరు? అన్నది తేలాల్సి ఉంది.
అయితే ఒకటి మాత్రం నిజం. మనం బాబు\జగన్\కేసీఆర్\మోదీ\గతంలో అయితే వైయస్ఆర్.. వీళ్లలో ఎవర్నయినా సరే ఎక్కడ విపరీతంగా ఆరాధిస్తామంటే లేదా అభిమానిస్తామంటే.. గడ్డు పరిస్థితులను ఏదో ఒక మాయ చేసి గట్టెక్కేస్తారనే విషయంలోనే. ఇక్కడే వీళ్లు మన దృష్టిలో హీరోలుగా నిలుస్తుంటారు.. అదే జగన్ విషయంలో జరుగుతుందేమో అన్న చిరు ఆశ.. ఆ పార్టీ వర్గాల వారి పాలిట భవిష్యత్ ఆశా జ్యోతిగా కనిపిస్తోంది. జగన్ మరి తనపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాలు నెరవేర్చుతాడా? లేక వమ్ము చేస్తాడా? ఆ కాలమే నిర్ణయించాలి..