మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ఈ సారి అసెంబ్లీకి గురి పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లిహిల్స్ నుంచి మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు గతంలో ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇటీవల ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. రాహుల్ గాంధీ సభలకు కూడా హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీకి దూరమయ్యారని అనుకున్నారు.
కానీ బీఆర్ఎస్ నుంచి పిలుపు రాకపోవడం .. బీజేపీ పరిస్థితి బాగో లేకపోవడంతో తనదే కాంగ్రెస్ టిక్కెట్ అని ఆయన మళ్లీ రేసులోకి వచ్చారు. కానీ అప్పటికే అజహరుద్దీన్ జూబ్లిహిల్స్ లో తిరగడం ప్రారంభించారు. ఆయనను అడ్డుకునేందుకు విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు ప్రయత్నాలు చేయడం వివాదాస్పదమవుతోంది. మరో వైపు విష్ణుకు బలమైన వ్యతిరేక వర్గం ఉంది. వారంతా అజహరుద్దీన్ వైపు చూస్తున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఓటింగ్ కూడా వారే ఎక్కువ వస్తారు. అందుకే అజహర్ అయితే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తోంది.
మరో వైపు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. ఆమెకు ఖైరతాబాద్ సీటు ఆఫర్ చేశారని చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్ రూల్ ప్రకారం చూస్తే.. విష్ణుకు టిక్కెట్ దొరకదు. పైగా విష్ణు రేవంత్ రెడ్డిపై వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకో కానీ ఆయన అసమ్మతి వాది అన్నట్లుగా వ్యవహరించారు. అంతిమంగా… విష్ణుకు ఈ సారి టిక్కెట్ కష్టమేనని.. పీజేఆర్ వారసురాలిగా విజయారెడ్డి బరిలో ఉంటారని జూబ్లీహిల్స్ నుంచి అజరుద్దీన్ బరిలోకి దిగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.