కేతన్ దేశాయ్…. ఈ పేరు వైద్య విద్య రంగంలో ఉన్న చాలా మందికి పరిచయం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన వ్యవస్థను భ్రష్టుపట్టించి ఇష్టారితీన అనుతమలు.. సీట్లు వ్యవహారాలు నడిపారు. ఓ సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అప్పట్లో ఈ వ్యవహారాలు సంచలనం అయ్యాయి. ఆయనను తప్పించారు. కానీ ఇప్పుడీయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్. అసలు ఎంసీఐ స్కాం నిందితుడేంది… టీటీడీ బోర్డు మెంబరేంది అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఆయన మార్క్ స్కాం ఏపీలో వెలుగు చూడటంతో అందరూ… అనుమానంగా చూడటం ప్రారంభించారు.
ఏపీలో మూడు మెడికల్ కాలేజీలు చాలా పకడ్బందీగా పీజీ మెడికల్ సీట్లను ఫోర్జరీ ద్వారా పెంచుకున్నాయి. వాటికి వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ కౌన్సెలింగ్ కూడా నిర్వహింంచింది. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కౌన్సెలింగ్ సందర్భగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం దేశంలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ఆపేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఢిల్లీ పోలీసులు చేసే దర్యాప్తులకు సహకరించాలని ఆదేశించి లైట్ తీసుకుంది. కానీ అసలు వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ వీసీ తీరుపై… ఆయన చెబుతున్న వ్యవహారాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోర్జరీ చాలా పకడ్బందీగా జరిగిందని ఎంసీఐ గుర్తించింది. మొత్తం వ్యవహారాల్లో నిపుణులు అయిన వారే ఈ పని చేస్తున్నారని అనుమానిస్తున్నారు. దీంతో సహజంగానే గతంలో ఇలాంటి స్కామ్ లకు పాల్పడిన వారిపై దృష్టి మళ్లుతుంది. టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న కేతన్ దేశాయ్ వ్యవహారమూ చర్చకు వస్తోంది. అసలు కేతన్ దేశాయ్ కు ఎందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది సస్పెన్స్ గానే ఉంది. గతంలోను టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. కొనసాగింపు ఇచ్చారు. ఆయన సాయంతో జరుగుతున్న దందాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఏపీలో వెలుగు చూసినా పీజీ మెడికల్ సీట్ల స్కాం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది . ఏపీ పరువు బజారున పడినట్లయింది. ఢిల్లీ పోలీసులు చేసే దర్యాప్తులో ఇంకెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సి ఉంది.