సీఎం జగన్ హాలీడే కోసం లండన్ వెళ్లారు. ఏపీలో కూడా పవర్ హాలీడే ప్రకటించారు. అయితే జగన్ రెడ్డి హాలీడే కు… ఏపీలోని పవర్ హాలీడేకే చాలా తేడా ఉంది. ఏపీలో అధికారికంగా పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారు. కరెంట్ లేదని అందు వల్ల రెండు వారాల పాటు పరిశ్రమలకు కరెంట్ కోతలు అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పరిశ్రమలు ఆర్థికంగా కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో పరిశ్రమలపై నాలుగేళ్గుగా పిడుగులు పడుతూనే ఉన్నాయి. పరిశ్రమలు అంటే ప్రభుత్వానికి డబ్బులు కట్టే సంస్థలుగానే చూస్తున్నారు కానీ… అవి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని… వాటిని కాపాడుకుందామనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కరెంట్ చార్జీలను ఇష్టం వచ్చినట్లుగా పెంచడంతో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. ఇప్పుడు ఇతర పరిశ్రమలకూ కరెంట్ కోతలతో అదే పరిస్థితి తీసుకు వస్తున్నారు.
గత ఏడాది కరెంట్ సమస్యతో పవర్ హాలీడే ప్రకటించారు. ఇప్పుడు కూడా అంతే. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడటంలేదు.కానీ ఇక్కడ సమస్య అది కాదు. కనీసం విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమకూర్చుకోవడానికి కూడా బద్దకమవుతుంది. అడ్డగోలు నిర్ణయాలు.. అంతులేని అవినీతి కారణంగా ఏపీ విద్యుత్ రంగం కూడా కుదేలవుతోంది. ఫలితంగా ప్రజల జీవన విధానం అస్తవ్యస్థమవుతోంది.