బిగ్ బాస్ 7 పోటీదారుల జాబితాని పరిశీలిస్తే శివాజీ ఒక ప్రత్యేకమైన పోటీదారుగా కనిపిస్తున్నారు. నేపధ్య పరంగా కూడా శివాజీ విలక్షణ. ఆయనకు సినిమా, రాజకీయం రెండు నేపధ్యాలు వున్నాయి. పరిశ్రమలో ఒకొక్క మెట్టుగా ఎదిగారు శివాజీ. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుపెట్టి హీరో అయ్యారు. ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ‘మిస్టర్ ఎర్రబాబు’ లాంటి సినిమాతో ఆ రోజుల్లోనే జాతిరత్నాలు తరహా సినిమా చేశారాయన. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మ, తాజ్ మహల్ లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు శివాజీ.
శివాజీ కంటూ సెపరేట్ టైమింగ్ డిక్షన్ వుంది. ఆయన మంచి వక్త. ఏదైనా విషయాన్ని చక్కగా కమ్యునికేట్ చేయగల ప్రతిభావంతుడు. ఆయన సెన్స్ అఫ్ హ్యుమర్ కూడా చాలా బావుటుంది. (తొలి రోజు ఆటలో ప్రిన్స్ యవార్ బాడీ చూపించుకుంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంటే.. ‘చూడండి.. పాపం వాడికి బట్టల్లేవ్’ అని తనదైన డిక్షన్ లో ఓ సెటైర్ కట్ చేసి నవ్వించారు శివాజీ).
ప్రస్తుతం హౌస్ లో ప్రతిభ, అనుభవం రెండూ వున్నవారిలో శివాజీ ముందువరుసలో వున్నారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో రాణించడం అంటే మాములు విషయం కాదు. అనుభవం, ప్రతిభతో పాటు మెంటల్ గా ఫిజికల్ గా బలంగా వుండాలి. టాస్కులన్నీ తెలివిగా ఆడాలి. వీటన్నిటికీ ఓపిక, సహనం, టైటిల్ కొట్టాలనే పట్టుదల వుండాలి. మరి శివాజీ ఎంత పట్టుదలతో ఈ ఆట ఆడుతారో చూడాలి.