అధికారం ఢిల్లీలో తమదే అని మరోసారి బీజేపీ.. బీఆర్ఎస్కు తెలియచేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ హైకోర్టు ఇచ్చి తీర్పును అమలు చేయాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీన్ని పట్టించుకోలేదు. వారి ఆఫీసుల చుట్టూ డీకే అరుణ తిరిగినా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు డీకే అరుణ తన పవర్ చూపించారు. నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తీసుకు వచ్చారు.
ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని పాటించాల్సి ఉంది. అనర్హతకు గురైన కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడంలో ఆలస్యం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే తరహాలో వేగంగా స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉంటే.. విచారరణకు వచ్చి ఉండేది. కానీ ఆలస్యంగా సోమవారమే పిటిషన్ వేశారు. ఎప్పుడు విచారణ జరుగుతుందో తెలియదు. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీర్పును అమలు చేయకపోయినా.. నేరుగా సీఈసీ నుంచి ఆదే్శాలు రావడంతో అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా గుర్తిస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కుతారు.