సూపర్ స్టార్ రజనీకాంత్ కు బీజేపీ గవర్నర్ పదవి ఆఫర్ చేసిందంటూ కొత్తగా లీకులు ప్రారంభమయ్యాయి. ఇటీవల రజనీకాంత్ తన తీర్థయాత్రల పర్యటనల్లో భాగంగా యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే ఆ పర్యటనల్లో బీజేపీ నేతలనే కాదు అందర్నీ కలిశారు. కానీ ఆయన మళ్లీ తమిళనాడు చేరుకునే సరికి.. గవర్నర్ పదవి గురించి పుకార్లు ప్రారంభమయ్యాయి.. ఎప్పట్లాగే ఈ పుకార్లపై రజనీకాంత్ స్పందించలేదు.
గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు కానీ.. అనారోగ్యానికి గురయ్యారు. దేవుడు తనను రాజకీయాల్లోకి వద్దంటున్నారని డిసైడయ్యి.. పార్టీ ప్రకటన విరమించుకున్నారు. మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇక తాను రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు. కానీ తమిళనాడులో .. ఎంతో కొంత బలపడాలనుకుంటున్న బీజేపీకి.. రజనీకాంతే ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఆయన ఇమేజ్ ను ఎలాగైనా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జైలర్ సూపర్ హిట్ తో రజనీ కాంత్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గవర్నర్ పదవి రెడీ అయిందని… బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రజనీ అంగీకరిస్తే.. గవర్నర్ పదవి పెద్ద విషయం కాదు. గవర్నర్ పదవి కంటే ఎంతో ఉన్నతంగా ఇప్పుడు ఆయన ఇమేజ్ ఉంది. గవర్నర్ పదవికి రాజకీయమేమీ ఉండదు కాబట్టి అంగీకరించినా సమస్య ఉండదన్న వాదన ఉంది. కానీ రజనీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కానీ… ఆయనను.. గవర్నర్ రజనీకాంత్ ను చేసేస్తున్న బీజేపీ ఫ్యాన్స్.