ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెప్టెన్గా 15 మందితో జట్టుని ఎంపిక చేసింది. శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్ జట్టులో వున్నారు.
ఈ జట్టుని పరిశీలిస్తే అనుభవానికే పెద్దపీట వేసినట్లు కనిపించింది. ఐపిఎల్ తో పాటు ఈ మధ్యలో జరిగిన మ్యాచుల్లో రాణించిన ఆటగాళ్ళు వైపు పెద్దగా మొగ్గుచూపలేదు సెలక్టర్లు. తిలక్ వర్మ సూపర్ ఫామ్ లో వున్నాడు. బ్లౌలర్స్ లో ప్రసీద్ కృష్ణ రాణిస్తున్నాడు. వీరితో పాటు ఇంకొంత మంది ఫామ్ లో వున్నారు. కానీ జట్టులోకి అనుభవం వున్న వారికే స్థానం దక్కింది.
వికెట్ కీపర్ స్థానంలోకి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పోటీపడగా.. సెలక్టర్లు ఇషాన్ వైపు మొగ్గు చూపారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్.. ఈ ముగ్గురు కూడా మంచి ఆటగాళ్ళు. అయితే ఈ మధ్య నిలకడ తప్పింది. ఐతే వీరికున్న అనుభవం కారణంగా జట్టులోకి తీసుకున్నారని భావించాలి.
అలాగే బౌలింగ్, అల్ రౌండర్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్థూల్ ఠాకూర్ అల్ రౌండర్ కేటగిరిలో ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.. వీళ్ళు కూడా సీనియర్లే. మొత్తానికి పెద్దగా మార్పులు, ప్రయోగాలకు అవకాశం లేకుండా అనుభవం గల టీంతోనే ప్రపంచ కప్ బరిలో దిగుతోంది టీమిండియా. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.