తెలంగాణ బీజేపీ టిక్కెట్ల ఖరారుకు ప్రక్రియ ప్రారంభించింది. ఎప్పుడూ లేని విధంగా అప్లికేషన్లు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లుగా అప్లికేషన్ కు ధర నిర్ణయించలేదు. అయినా పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. పొటెన్షియల్ లీడర్లు ఎవరూ దరఖాస్తు చేయడం లేదు. తమకు కాక ఎవరికి ఇస్తారన్నట్లుగా వారి తీరు ఉంది. నిజానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాక ముందే బీజేపీ నాయకత్వం అభ్యర్థులపై కసరత్తు జరిపింది. కానీ గట్టిగా ఇరవై స్థానాలకు మాత్రమే.. అభ్యర్థులు కనిపించారు. మిగతా చోట్ల ఎవరిని దింపాలో అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి , బండి సంజయ్, రఘునందన్ వంటి బీజేపీ నేతలతో పాటు ఈటల, కోమటిరెడ్డి వంటి వలస నేతలందర్నీ లెక్కలేసుకుంటే ఇరవై స్థానాల్లో కాస్త బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టగలమని బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. మరి మిగతా చోట్ల పరిస్థితి ఏమిటన్నది వారికి అర్థం కావడంలేదు. ఇతర పార్టీల నుంచి వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ వస్తారన్న సూచనలు కనిపించడం లేదు. అలా అని ఆయా నియోజకవర్గాల్లో పోటీ లేదని కాదు. బీఫాం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే… ఆ బీఫాంతో గెలవమని తెలిసిన తర్వాత చాలా చేయవచ్చు మరి.
బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ లో చేరే వలస నేతలపై ఓ క్లారిటీ వచ్చింది. దీంతో ఆ పార్టీ కూడా గట్టి నమ్మకంతోనే ఉంది. కానీ బీజేపీ పరిస్థితే అటూ ఇటూ కాకుండా ఉంది . ఆ రెండు పార్టీల నుంచి వచ్చే వారికి సీట్లివ్వడం కోసం ఎదురు చూస్తోంది. అందుకే బీజేపీ సీట్ల ఖరారు నామినేషన్ల చివరి వరకూ ఉండే అవకాశం ఉంది.