కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి బుంగమూతి పెట్టారు. ఈ విషయాన్ని ఆయనే లీక్ చేసుకున్నారు. ఎలా అంటే.. తనకు పార్టీ కంటే ఆత్మగౌరవం ముఖ్యమని వ్యాఖ్యానించడం ద్వారా. తనకు పార్టీలో కీలక పదవులేమీ ఇవ్వడం లేదని.. అందుకే బుంగమూతి పెట్టానని ఆయన తన స్టేట్ మెంట్ ద్వారా చెప్పడమే కాకుండా.. ఎలాంటి పార్టీ సమావేశాలకు రాకుండా ఇంట్లో ఉండిపోయారు. కోమటిరెడ్డి సమావేశాలకు రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు.
అయితే భట్టి విక్రమార్క ఈ విషయాన్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ థాక్రేకు చెప్పి.. ఆయన ఇంటికి తీసుకెళ్లి బుజ్జగింపచేశారు. ఇంట్లో నుంచే కేసీ వేణగోపాల్ కు ఫోన్ చేయించి.. మంచి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విబేధిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు కోమటిరెడ్డి. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో.. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం.. ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అయితే ఇలా ప్రతీ దానికి కోమటిరెడ్డి అలగడం ఏమిటని.. పార్టీ కోసం పని చేస్తే హైకమాండ్ గుర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ దానికి హైకమాండ్ ను అలక పేరుతో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం.. పార్టీ కోసం పని చేస్తున్న ఇతర నేతల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది.