అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు ప్రమోటర్లు సహా అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా మొత్తం 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది. ఈడీ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అక్టోబరు 3న హాజరు కావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మందిని సుమారు రూ.6,380 కోట్లు మోసం చేశారని ఏపీ సీఐడీ నిందితులపై అభియోగం మోపింది. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా నిధుల మళ్లింపుపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరిపింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు రూ.4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
నిజానికి ఆస్తుల్ని వేలం వేసి డిపాజిటర్లకు ఇచ్చేయాలని గత ప్రభుత్వం అనుకుంది. లేనిపోని ఆరోపణలు చేసిన జగన్ రెడ్డి… తాను రాగానే అందరి డబ్బులు ఇస్తామన్నారు. తీరా వచ్చాక పైసా ఇవ్వలేదు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి కోర్టులో జమ చేసిన డబ్బునే పంపిణీ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ లో రూ. 1050 కోట్లిస్తామన్న జగన్.. రూపాయి కూడా ఇవ్వలేదు.కానీ బడ్జెట్లో పెట్టారు.
ఇప్పుడు ఈడీ ఆస్తులను అటాచ్ చేయడంతో వేలం పూర్తిగా ఆగిపోయింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో కొన్నింటిని ఇప్పటికే వేలం వేశారు. వాటినీ ఈడీ జప్తు చేయడంతో వారూ ఇబ్బంది పడుతున్నారు. ఇక ముందు ఆస్తుల్ని వేలం వేసే అవకాశం లేకుండా పోయింది. మరో వైపు ప్రభుత్వమూ ఇస్తామని చెప్పి మోసం చేసింది. అంతిమంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నష్టపోయారు.