టిక్కెట్ల దాకా వచ్చిన తెలంగాణ బీజేపీలో ముసలం ప్రారంభమయింది. ఈటల రాజేందర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి కారణం పార్టీలోచేరికలే. అసలే చేరికలులేవు. చేరుతామని వచ్చే వాళ్లను రకరకాల సమస్యలతో అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి సీ కృష్ణయాదవ్ను బీజేపీలో చేర్చేందుకు ఈటల ప్రయత్నించారు. ఆయన అంగీకరించారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యం లేకపోవడం.. ఈటల అడిగారని… కృష్ణాయాదవ్ బీజేపీలో చేరేందుకు అంగీకరించారు. అయితే పార్టీలో చేరే రోజున కిషన్ రెడ్డి అడ్డుపడ్డారు.
తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణయాదవ్ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆపేశారు. దీంతో ఈటల ఇది తనకు జరిగిన అవమానంగా ఫీలయ్యారు.
అదే మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడిని కాషాయకండువా కప్పి కిషన్రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్కడ తుల ఉమకు వేములవాడ టిక్కెట్ ఇప్పిస్తాననే హామీతో ఈటల రాజేందర్ తనతోపాటు బీజేపీలోకి తెచ్చారు. తాను తెచ్చే వారిని చేర్చుకోకపోగా.. తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచే ప్రయత్నం చేయడంతో ఈటల చిన్నబుచ్చుకుంటున్నారు. మరో వైపు
బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున చీలికలు తెచ్చి, నేతల్ని బీజేపీలోకి తెస్తారని ఆశించారు. అలాంటిదేం అక్కడ జరక్కపోవడంతో ఈటలపై పార్టీ పెద్దలు కూడా నమ్మకం కోల్పోతున్నారు.
ఇటీవల ఖమ్మం సభలో ఇరవై రెండు మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. కానీ.. ఒక్కరు కూడా చేరలేదు. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జీ వివేక్, రవీంద్రనాయక్ వంటి నేతలమంతా కలిసి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా యెన్నం శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పారు. రఘునందన్ రావు తాను పార్టీ మారబోనని పదే పదే చెప్పాల్సి వస్తోంది. పార్టీ నాయకత్వాన్ని మార్చిన తర్వాత బీజేపీ పరిస్థితి ఘోరంగా మారిందని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.