ఎన్నికల కోసం అధికార పార్టీలు రెడీ అయ్యే విధానం వేరుగా ఉంటుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కొత్త కొత్త తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఏదో చేస్తున్నట్లుగా హడావుడి చేస్తూంటాయి. తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తోంది. అయితే ఏపీలో సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఎక్కడా లేనంత నీరసంతో ఉంది. పైగా… ప్రజా సమస్యలు.. పాలనా వైఫల్యాలకు తోడు.. జనాల్లోకి వెళ్లలేకపోతున్న సీఎం తీరుతో క్యాడర్ ఇబ్బంది పడుతోంది.
పాలనా వైఫల్యాలతో ప్రజలకు ఇక్కట్లు
అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలకు వెళ్లే ముందు తీసుకునే జాగ్రత్తలు చాలా పక్కాగా ఉంటాయి. ముందుగా ప్రజలకు కనీస అవసరాల విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటారు. అంటే కరెంట్, నీరు వంటివి. ఇందు కోసం పక్కా ప్రణాళికలు వేసుకుంటారు. ఎందుకంటే వీటిలో తేడా వస్తే ప్రజల ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో సంక్షేమపథకాలను సమయానికి అందించడమే కాదు.. అవసరం అయితే ఒకటి, రెండు ప్రారంభిస్తారు కూడా. అయితే ఈ రెండు విషయాల్లో ఏపీ ప్రభుత్వం ప్రణాళిక దారి తప్పినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో పథకాలకు నిధులు ఆలస్యం కావడం.. వరుసగా కరెంట్ కోతలు విధించాల్సి వస్తోంది. వరి సాగు చేయవద్దంటూ తాజాగా మంత్రి చేసిన ప్రకటన వారి దుస్థితిని వెల్లడిస్తోంది. రోడ్ల కోసం సెస్ వసూలు చేసినా గుంతలు కూడా పూడ్చడం లేదు.
జీతాలివ్వలేకపోతున్న వైనం
ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆరోనెల ప్రారంభం నడుస్తోంది. కానీ డబ్బులు లేకపోవడంతో జీతాలు, పెన్షన్లు సమయానికి ఇవ్వలేకపోయారు. కాపునేస్తం పథకానికి బటన్ నొక్కడానికి ఏర్పాట్లు చేసినా నొక్కలేకపోయారు. దీనికి కారణం నిధుల సమస్యే. ఎలాగోలా అప్పులు తెచ్చుకుని గట్టెక్కుతోంది. ఈ అప్పుల సంగతి పక్కన పెట్టినా.. సమయానికి బటన్ నొక్కుతున్నా అని సీఎం జగన్ నమ్మకంగా చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ బటన్ టైమింగ్ మిస్సవుతోది. కొన్ని సార్లు బటన్లు నొక్కినా నగదు జమ కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితి లబ్దిదారుల్లో అనూమానాలను కలిగిస్తోంది.
ప్రజల్లోకి వెళ్లలేని సీఎం
గ్రామ గ్రామాన సీఎం జగన్ చేసిన ఘనకార్యాల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆయన సీమలో ఓ సారి హెలికాఫ్టర్ మొరాయించిందని పది కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా ఎవరికీ తెలియకుండా ప్రయాణిస్తే.. దారిలో రెండు, మూడు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ప్రభుత్వం మోసం చేసిందని.. రావాల్సి న డబ్బులు ఇవ్వాలని వారి ఆందోళన. కానీ ఎలాగోలా వారిని నెట్టేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ప్రతి ఊళ్లోనూ అలాంటి సమస్యలు ఉంటాయి. ఎన్నికల సమయంలో పార్టీ వాళ్లతోనే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా.. ఇలాంటివి తప్పవు. ఎందుకంటే జగన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తల్నీ మోసం చేశారు పరిస్థితి చూస్తూంటే… ముందే చేతులెత్తేశారన్న వాదన వినిపిస్తోంది.