టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరికల విషయంలో ఓ ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారు. పార్టీకి మేలు చేస్తారని భావిస్తున్న నేతల్ని ఎక్కడ ఉన్నా.. వెంటపడి చర్చలు జరిపి పార్టీలోకి తీసుకు వస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్లు ప్రకటించిన నేతల్ని కూడా రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. పొటెన్షియల్ అనుకున్న నేతల్ని ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. మైనంపల్లి హన్మంతరావుతో చర్చలు కూడా పూర్తి చేశారు. ఆయన ఆర్థికంగా బలవంతుడు కావడం.. తన కుమారుడ్ని ఎలాగైనా గెలిపించుకు వస్తారన్న నమ్మకం ఉండటంతో.. రెండు టిక్కెట్లు ఇచ్చేందుకు హైకమండ్ ను ఒప్పించారు.
తుమ్ముల నాగేశ్వరరావు ను కూడా రేవంత్ రెడ్డి పార్టీలో చేరేందుకు ఒప్పించారు. షర్మిల పార్టీ కి చెక్ పెట్టడానికి అయినా తుమ్మల చేరిక ముఖ్యం కావడంతో బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో చర్చలు జరిపి మరీ తుమ్మల చేరికకు మార్గం సుగమం చేశారు. పాలేరు లేదా ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయించేందుకు అవకాశం ఉంది. బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దక్కినా కొంత మందిలో చివరి క్షణంలో బీఫాం ఇవ్వరేమోనన్న అనుమానాలతో ఉన్నారు. అలాంటి వారిని కూడా రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. టిక్కెట్ దక్కిన వారిని చేర్చుకుంటే… బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని నమ్ముతున్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాత్మక చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. గతంలో పదవుల కోసం… ఇతర ప్రలోభాలతో పార్టీని వీడిన నియోజకవర్గ స్థాయి నేతల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నా ప్రయోజనం ఉండదని.. కాంగ్రెస్ లో కి వస్తే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. సర్వేల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోందన్న ఫలితాలు వస్తూండటంతో ఎక్కువ మంది చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.