దేశ్ కీ నేత అని ఇతర రాష్ట్రాల పర్యటనల్లో ఫ్లెక్సీలు కట్టించుకున్న కేసీఆర్ ఇప్పుడు నోరు తెరవడానికి ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా సందేహిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు అనే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ కేసీఆర్ వీటిపై తన అభిప్రాయాలేమిటో చెప్పేందుకు సాహసించడం లేదు. దీంతో అసలు బీఆర్ఎస్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఏదో విధంగా చర్చల్లో ఉండాలని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. కానీ కేసీఆర్ మాత్రం వీలైనంత లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. దేశానికి సంబంధించిన కీలక అంశాల్లో తనకు ప్రత్యేకమైన అభిప్రాయం లేనట్లుగా ఉంటున్నారు. అయితే కేసీఆర్ స్పందించలేదని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంటే.. ఆయనను అసలు జాతీయ రాజకీయ వర్గాలు అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థం అవుతుంది. కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ గానే ఉంచినట్లయితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ తాను బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీ పెట్టానని ప్రటించారు. ఇలాంటి సమయంలో ఆయన జాతీయ అంశాలపై తమ పార్టీ విధానాన్ని ప్రకటిచాల్సి ఉంటుంది . కానీ అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో … ఆయనది సీరియస్ నెస్ లేని రాజకీయం అనే అభిప్రాయం వినిపిస్తోంది.
రాజకీయాల్ని మార్చే పరిణామాలు జరుగుతున్నప్పుడు జాతీయ రాజకీయాల్లో తన దైన ముద్ర వేయాలనుకున్న వారు తమ ఖచ్చితమైన స్టాండ్ ను ప్రకటిస్తారు. తమ విధానం ఇది అని చెబుతారు. కానీ ఈ విషయలో కేసీఆర్ మొదటి నుంచి వెనుకబడే ఉన్నారు. జమిలీ ఎన్నికలు, ఇండియా పేరును, భారత్‌గా మార్చటం తదితర అంశాలతో కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కదోవ పట్టిస్తోందన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్న సమయంలో బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనముద్రను ఎంచుకుంది. అందుకే ఆయన పార్టీపై బీజేపీ ముద్ర పడుతోంది.