తెలంగాణ గవర్నర్ గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ తమిళిశై రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నానని ప్రశంసించారు. అంతే కాదు.. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను… తన దారి తనదేనన్నారు. అదే సమయంలో సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కానని గవర్నర్ తెలిపారు.
కోర్టు కేసులకు, విమర్శలకు భయపడబోనన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరని పరోక్షంగా హెచ్చరించారు. అయితే బిల్లులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైళ్లపై సంతకాలు పెడతారా అంటే.. గవర్నర్ తన అభిప్రాయాలను మార్చుకోనని స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వానికి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదని స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఉందనిపిస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
అంటే ఇప్పుడు సిఫారసు చేసిన పేర్లపై సంతకాలు చేయబోనని ఆమె చెప్పినట్లయింది. ఇటీవల కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో సంబంధాలు మెరుగుపడినట్లుగా వ్యవహరిస్తున్నారు. మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత రోజు.. సెక్రటేరియట్ కు ఆహ్వానించారు. అతిథి మర్యాదలు చేశారు. దానికి తగ్గట్లుగా కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు కానీ.. బిల్లులు, ఎమ్మెల్సీలకు ఆమోదం తెలుపుతానని మాత్రం ఆమె చెప్పడం లేదు.