రాజధాని అమరావతి భూదందాల గురించి సాక్షిలో వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో.. శనివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఇదే చర్చతో వేడెక్కిపోబోతున్నాయి. అయితే తెలుగుదేశం గురించి వైకాపా చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికా అన్నట్లుగా వారు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో వైకాపా నాయకులు కూడా కొనుగోలు చేసిన భూములు ఏమైనా ఉంటే .. వాటి గురించి వివరాలు సేకరించి.. భూ కొనుగోలు అనేది కేవలం వ్యాపారం మాత్రమే, మీ వాళ్లు కూడా కొన్నారు కదా.. అని కౌంటర్ ఇవ్వడానికి తెదేపా శ్రేణులు ఉత్సాహం చూపిస్తున్నాయి. అదే వ్యూహంగా సాగుతున్నాయి.
తుళ్లూరు ప్రాంతం, అమరావతి పరిసరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన వారు కొనుగోలు చేసిన భూవివరాలను మొత్తం ఇప్పుడు సేకరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మేంచేసింది అక్రమం అయితే మీరు చేసింది కూడా అక్రమమే కదా అని ఎదురు దాడి చేయడానికి వీరు సిద్ధమౌతున్నారు.
శోచనీయమైన విషయం ఏంటంటే.. మీరు తప్పు చేశారు అని ప్రతిపక్షం నిందిస్తే.. మేం తప్పు చేయలేదు.. అని వారు అనడం లేదు. మీ వాళ్లు కూడా అదే పనిచేశారు.. అని వాదించడానికి సాహసిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో భూములు కొనడం అనేది ఎంతమాత్రమూ తప్పు కాదు.. చంద్రబాబు చెప్పిన మాటలు కూడా అక్షరాలా వాస్తవం. వ్యాపారం తప్పు కాదు. కానీ ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ”ఎప్పుడు” కొన్నారు? అనే అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఉంది! కానీ తెలుగుదేశం నాయకుల వైఖరి చూస్తే ఆ విషయాన్ని మరుగు పరచి.. వైకాపా వారు కూడా కొన్నారు కనుక.. తమను నిందించే అర్హత వారికి లేదని వాదించేలా కనిపిస్తోంది.