మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై చిత్ర పరిశ్రమ తీరు నిజంగా దారుణంగా వుంది. అసలు అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరో తమకి తెలియనట్లుగా, కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్లు సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మామూలు నాయకుడు కాదు. ఒక దశలో దేశ రాజకీయాలని శాసించిన విజనరీ లీడర్. దేశ ప్రధాని అయ్యే అవకాశం వున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవివైపే మొగ్గు చూపి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేసిన నాయకుడని అప్పటి రాజకీయాలని దగ్గరుండి పరిశీలించిన వారికి తెలుసు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రతి అభివృద్ధిపై ఆయన ముద్ర వుంది.
చిత్ర పరిశ్రమ విషయానికే వద్దాం. చంద్రబాబు పాలనలో చిత్ర పరిశ్రమ స్వర్ణయుగం చూసిందనే చెప్పాలి. పరిశ్రమకు కావాల్సింది సమకూర్చడంలో బాబు చూపిన చొరవ అందరికీ తెలుసు. ఈ రోజు హైదరాబాద్ సినిమా హబ్ గా మారిందంటే .. అది ఒక్క రోజులో జరిగిపోలేదు. ఆయన పాలనలో అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపై కూడా ప్రత్యేక ద్రుష్టి పెట్టడం వలనే ఇది సాధ్యమైయింది.
సినిమా పరిశ్రమలో చంద్రబాబు పాలనలో లబ్ది పొందిన వారి జాబిత పెద్దదే. ప్రత్యేకంగా పేర్లు ప్రస్థావించడం అనవసరం లేదు కానీ ఇప్పుడున్న అగ్ర హీరోలు, నిర్మాతలు ఇలా ఎంతోమంది బాబుని ఆశ్రయించి లబ్ది పొందారు. అశ్వినీ దత్, మురళీ మోహన్ లాంటి వారి విషయంలో చంద్రబాబు విమర్శలు కూడా ఎదురుకున్నారు. కానీ నేడు విచిత్రంగా అలా సాయం పొందిన వారు కూడా మౌనంగా వున్నారు. కనీస మద్దతుగా ఒక మాట చెప్పడానికి కూడా మందుకు రావడం లేదు.
ఇప్పటివరకూ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన చూస్తే.. రాఘవేంద్రరావు ట్విట్టర్ లో అరెస్ట్ అక్రమమని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన మద్దతు మిత్ర పక్షం కిందకి వస్తుంది. ఇలాంటి అరెస్ట్ లకు భయపడేది లేదని బాలకృష్ణ చెప్పడం కూడా పార్టీ పరంగానే వస్తుంది. నట్టికుమార్ లాంటి నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం. ఆయన కూడా చిత్ర పరిశ్రమ స్పందించకపోవడం బాధాకరం అన్నారు. మరి మిగతా పరిశ్రమకి ఏమైయింది..?
చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడానికి చిత్ర పరిశ్రమకు ఎందుకు అంత భయం. చంద్రబాబు కుటుంబం సభ్యులైన జూ ఎన్టీఆర్ కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు. అరెస్ట్ అక్రమం అని చెప్పాల్సిన పని లేదు. పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ‘’పెద్దాయన… త్వరగా ప్రజా క్షేత్రంలో తిరిగిరావాలి’’ అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు.
అసలు చిత్ర పరిశ్రమ ఎందుకు భయపడుతుంది. ఈ నాలుగేళ్లలో చిత్ర పరిశ్రమ జగన్ సర్కార్ చేసిన సాయం నిలిపేస్తారాని భయపడుతున్నారా ? నిలిపేయడానికి ఏం సాయం చేశారని? చిరంజీవి లాంటి వెండితెర ఇలవేల్పుని చేతులు కట్టించారనా? ముఖ్యమంత్రిని కలవడానికి వెళితే కిలో మీటర్ దూరంలో కార్లు ఆపేసి .. చిరంజీవి. నాగార్జున. మహేష్ బాబు. రాజమౌళి, ప్రభాస్ .. ఇలా అగ్రతారలందరీని నడిపించుకుంటూ తీసుకెళ్ళారనా? నంది అవార్డులు వేడుక ఘనంగా చేశారనా ? షూటింగులకు అమోఘమైన రాయితీలు ఇచ్చారనా? సినిమా టికెట్ రేట్లతో ఆటలాడుకున్నారనా ? ఏ విషయంలో జగన్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమని గౌరవించిందని ?! బహుశా సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో కూడబెట్టుకున్న ఆస్తులకు అపాయం వాటిల్లుతుందని భయపడుతున్నారేమో.
హీరోలు తెరపైనే కానీ రియల్ లైఫ్ లో ఒక సామాన్యుడు కంటే ఎక్కువ భయాలతో ఉంటారని ఒక విమర్శ వుంది. ఇప్పుడున్న చిత్ర పరిశ్రమ తీరు, వారు పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.