చంద్రబాబును అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అసలు అరెస్ట్ చేసిన పద్దతేమిటన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ చంద్రబాబుకు పరిచయస్తులతో పాటు ఆయన కలసి పని చేయని వారు.. న్యాయరంగంలో నిపుణులు కూడా ఇదేం పద్దతని ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలను ఇంత ఘోరంగా దిగజార్చడం ఏమిటని ఆందోళన చెందుతున్నారు. సామాన్యప్రజల్లోనూ ఇదే భయం కనిపిస్తోంది.
వ్యవస్థలు తమకు రక్షణగా ఉంటాయని జనం నమ్మకం కోల్పోయే పరిస్థితులు
రాజ్యాంగం ప్రకారం ప్రజల రక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థలు దారి తప్పితే ప్రజల్లో ఏర్పడే ఆందోళన అంతా ఇంతా కాదు. తమకు ఎక్కడా న్యాయం లభించదని వారు అనుకునే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. అరాచకం రాజ్యమేలుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చని ఎవరూ అనుకోవడం లేదు. అసలు నిందితుడు కాని వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అసాధారణం. అసలు అరెస్టు చేసిన వ్యక్తిపై ప్రాథమిక ఆధారాలు ఒక్కటంటే ఒక్కటి చూపలేకపోయారు. ఆయినా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అంతటి హోదాలో ఉన్న వ్యక్తికే ఆ పరిస్థితి వస్తే ఇక సామాన్యులకు న్యాయం అనేది దక్కుతుందా ?. రక్షణ వ్యవస్థల నుంచి భరోసా ఉంటుందా ?
అసలు లేని, జరగని స్కాముల్లో తప్పుడు ప్రచారాలు చేసి కేసులు పెట్టేస్తారా ?
ఇన్నర్ రింగ్ రోడ్ అనే కేసులో అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ మార్చారని.. ఎవరికో లబ్ది చేకూర్చారని కేసులు పెట్టారు. దాన్ని వ్యవస్థలు ఇలాంటి కేసులు ఎలా పెడతారని ప్రశ్నించలేకపోయాయి. ప్రభుత్వం టార్గెట్ చేసిన వారికి ముందస్తు బెయిల్స్ ఇవ్వడం వంటివి చేస్తున్నాయి.. కానీ ఇందులో ప్రాధమిక ఆధారాలేవని ప్రశ్నించలేదు. స్కిల్ స్కాములోనూ అంతే. అసలు స్కామే జరగలేదని బహిరంగంగా ఉన్న ఆధారాలను బట్టి సామాన్యుడు అర్థం చేసుకుంటున్నాడు. డబ్బులు దారి మళ్లింపు అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆధారాలు చెప్పలేదు. డిజైన్ టెక్ … పీవీ రమేష్.. సహా అందరూ జరిగింది చెబుతున్నారు. కళ్ల ఎదుట శిక్షణ తీసుకున్న రెండున్నర లక్షల మంది ఉన్నారు. అయినా అప్పటి ముఖ్యమంత్రి స్కాం చేశారని అర్థరాత్రి అడ్డగోలుగా అరెస్ట్ చేయడం ఏమిటి వ్యవస్థలు గుడ్డిగా సమర్థించడం ఏమిటి?
ప్రజల్లో పెరిగిపోతున్న భయం
ప్రజల్లో సామాన్యులు చట్టబద్దంగా, న్యాయబద్దంగా బతుకుతారు. అధికారం ఉన్న వారు ఇష్టారాజ్యంగా బతికి.. తాము అన్నింటికీ అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తారు . కానీ అందరూ సమానమేనని ప్రజా జీవితాల్ని తప్పుడు విధానాలతో ఎవరూ నిర్వీర్యం చేయలేని వ్యవస్థలు నిరూపించాల్సి ఉంది. కానీ రాజ్యాంగ వ్యవస్థలు బలంగా ఉన్నా.., వాటిని నడిపేవారు కూడా మనుషులే కదా అన్నట్లుగా ఉంది. చట్టం, న్యాయాలను పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడుతూండటంతో… ఇక మా లాంటి వారికి రక్షణ ఎలా ఉంటుందన్న ఆందోళన అన్ని చోట్లా వినిపిస్తోంది.