సీఎం కేసీఆర్ పూర్తిగా మౌనముద్రలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి అంతర్గత ఆలోచనలు మాత్రమే చేస్తున్నారు. జాతీయ రాజకీయాల గురించి అసలు పట్టించుకోవడం లేదు. చివరికి మహారాష్ట్రలో దున్నేస్తానని అక్కడకు ప్రతి రెండు వారాలకు ఓ సారి వెళ్లి వస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడకు వెళ్లలేకపోతున్నారు. ఎప్పుడో ఓ సారి అక్కడ నుంచి వచ్చే వారికి కండువాలు కప్పడం మినహా ఏమీ చేయడం లేదు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఉంటుందని చెబుతున్నారు కానీ.. ఎప్పటికప్పుడు.. ఇప్పుడు కాదని చెబుతూ వస్తున్నారు.
ప్రస్తుతం జమిలీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈసీ ఎన్నికల సన్నాహాలను దాదాపుగా పూర్తి చేసింది. ఇలాంటి సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. గతంలో కేంద్రం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలిస్తే బీఆర్ఎస్ చీఫ్ కు సమాచారం ఉండేది.కానీ ఇప్పుడు అలాంటి సమాచారం ఏదీ ఉండటం లేదు. కారణం ఏమిటో కానీ… ఇలాంటి హడావుడి ఉంటుందని తెలిస్తే అసలు కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించి ఉండేవారు కాదు. ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించడంతో…ఎన్నికలు ఉంటాయా లేవా అన్న టెన్షన్ కు గురి కావాల్సి వస్తోంది.
జమిలీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ తెలంగాణపై తప్ప.. మహారాష్ట్రపై కూడా కనీస దృష్టి పెట్టలేరు. అప్పుడు తన పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్న ఫలం కూడా దక్కదన్న వాదన వినిపిస్తోంది. జాతీయస్థాయిలో దున్నేస్తానని.. భారీగా ఖర్చు పెట్టుకుని చేసిన ప్రచారం అంతా వృధా అవుతుందని.. కేసీఆర్ వ్యూహాలు ఘోరంగా విఫలమైయినట్లవుతుందని బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.